సాక్షి, హైదరాబాద్: సంపన్నుల పిల్లలు, యువత, విద్యార్థులే టార్గెట్.. ఎక్కడా చిక్కొద్దు.. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం.. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించడం.. ‘డెడ్ డ్రాప్’ విధానంలో డ్రగ్స్ అందజేయడం.. లేదంటే కొరియర్‌లో సరఫరా చేయడం.. ఎక్కడా ‘అసలు’ మనుషులు నేరుగా కనిపించరు. డ్రగ్స్ మాత్రం చేరిపోతాయి.
ఎవరికీ చిక్కకుండా అత్యాధునిక, సరికొత్త విధానాల్లో వ్యవస్థీకృతంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్న ఇద్దరు సప్లయర్లు, రాష్ట్రానికి చెందిన ఆరుగురు పెడ్లర్స్ (స్థానిక డ్రగ్స్ విక్రేతల)ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సంపన్నుల పిల్లలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులపైనా కేసులు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు..
ఫర్హాన్ మహ్మద్, నరేంద్ర ఆర్య
డార్క్ వెబ్‌లో ఆర్డర్లు తీసుకుని..
హరియాణా, మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవా, రాజస్తాన్‌లలో స్థిరపడిన నరేంద్ర ఆర్య, ఫర్హాన్ మహ్మద్ అన్సారీ దేశవ్యాప్తంగా పెడ్లర్స్ (స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవారు) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్‌టసీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ ముఠాల నుంచి తెప్పించుకుని.. దేశవ్యాప్తంగా పెడ్లర్లకు సరఫరా చేస్తున్నారు.
బికర్‌మీ యాప్‌లో హోలీ షాప్, ట్రిమినేటర్ పేర్లతో ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో ఈ ఐడీలతోపాటు తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు ‘జుంబద కార్టెల్’ అనే ఐడీ ద్వారానూ డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఐడీ ఎవరిదన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది.
►హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు ఉత్కర్‡్ష ఉమంగ్, సాహిల్ శర్మ, అబ్దుల్లా అన్సారీ అహ్మద్‌ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్‌కుమార్, పి.భూషణ్‌రాజ్ డార్క్‌వెబ్‌లోని ఆ ఐడీలతో చాటింగ్ చేస్తూ డ్రగ్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. బినాన్స్, వజీరెక్స్ వంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా క్రిప్టో కరెన్సీని సరఫరాదారులకు పంపుతున్నారు.
►క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు అందాక.. సరఫరాదారులు కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్‌ను పంపిస్తున్నారు. కొరియర్‌లో అయితే వస్తువులు, వస్త్రాల మాదిరిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి పంపేదీ, ఎవరు పంపేదీ తెలియకుండా తప్పుడు వివరాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువశాతం డెడ్ ట్రాప్ విధానంలో డ్రగ్స్ అందిస్తున్నారు. ఏమాత్రం ఊహించని ఓ ప్రాంతంలో డ్రగ్ పార్శిల్ ఉంచి.. ఆ వివరాలను మెసెంజర్ ద్వారా పెడ్లర్స్‌కు అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు.
►ఇలా డ్రగ్స్ అందుకున్న పెడ్లర్స్ దాన్ని హైదరాబాద్‌లో ధనికుల పిల్లలు, యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు టార్గెట్‌గా విక్రయిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఈ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించినట్టు తెలిసింది. బీబీఏ విద్యార్థులైన అన్సార్, ఉమంగ్, సాహిల్‌లు కొన్ని సందర్భాల్లో ఇంద్రకుమార్ నుంచీ డ్రగ్ ఖరీదు చేస్తున్నారు. గతంలో ఓసారి అరెస్టైన ఉమంగ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో రేవ్ పార్టీలు ఇస్తుండేవాడని గుర్తించారు.
నిఘా పెట్టి..
ఈ డ్రగ్ నెట్‌వర్క్‌పై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్‌స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియల్ బృందం పక్కాగా నిఘా పెట్టింది. అదను చూసి వలపన్ని ఇద్దరు సరఫరాదారులతోపాటు ఆరుగురు పెడ్లర్స్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి 140 గ్రాముల చరస్, 184 బోల్ట్స్ ఎల్‌ఎస్‌డీ, 10 గ్రాముల ఎండీఎంఏ, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హూమయూన్‌నగర్, చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది. నరేంద్రకు దేశవ్యాప్తంగా 450 మంది కస్టమర్లు ఉండగా గత ఏడాదిలో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను, ఫర్హాన్ ఆరు నెలల కాలంలో రూ.15 లక్షల డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు గుర్తించారు.
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి
ఈ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొంటున్న వారిలో సంపన్నులు, విద్యాధికుల పిల్లలు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులున్నారు. తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తున్న పార్శిళ్లపై కన్నేసి ఉంచాలి. అనుమానాస్పదంగా ఉన్న వాటిని విప్పి పరిశీలించాలి. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే నిఘా పెట్టాలి. డ్రగ్స్ సప్లయర్లతోపాటు వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తున్నాం. వారికి కౌన్సెలింగ్, రీహ్యాబ్ తర్వాత ఏడాదిపాటు పరిశీలనలో ఉంచుతున్నాం. చార్జి షీట్ దాఖలు సమయానికి మార్పు వచ్చిన వారిని ఆయా కేసుల్లో సాక్షులుగా మారుస్తున్నాం. డ్రగ్స్ బానిసల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం.
–సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
Comments
Please login to add a commentAdd a comment