దొంగగా మారిన డిగ్రీ విద్యార్థి! | Degree Student Theft Gold Jewellery In Vizianagaram | Sakshi
Sakshi News home page

దొంగగా మారిన డిగ్రీ విద్యార్థి!

Published Wed, Aug 5 2020 9:15 AM | Last Updated on Wed, Aug 5 2020 9:15 AM

Degree Student Theft Gold Jewellery In Vizianagaram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బొబ్బిలి: బొబ్బిలిలో అద్దెకుంటూ డిగ్రీ చదువుకుంటున్న యువకుడు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగగా మారాడు. ఉపాధ్యాయుల ఇంట్లో చొరబడి 14 తులాల బంగారాన్ని కాజేశాడు. అయితే పోలీసులు వారం రోజుల్లోనే కేసును ఛేదించి..  విద్యారి్థతోపాటు అతనికి సహకరించిన యువకుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ పాపారావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీకి పాల్పడిన వ్యక్తులను, రికవరీ చేసిన చోరీ సొత్తును ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. బొబ్బిలి రైల్వే ఫ్లైఓవర్‌ దిగువున గల నాయుడు కాలనీలో ఉపాధ్యాయ దంపతులు ఆరిక ఉదయకుమార్, బిడ్డిక ఆశాజ్యోతిలు నివాసముంటున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా స్వగ్రామమైన కురుపాం వెళ్లి తిరిగి జూలై 31న వచ్చారు.  ఇంటికి వేసిన తాళం ఉంటుండగానే లోపల బీరువా తెరచి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా 14 తులాల బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ బి.రాజకుమారి విజయనగరంలో డీఎస్పీ శిక్షణ పొందుతున్న జెస్సీ ప్రశాంతికి ఈ కేసును అప్పగించారు. బొబ్బిలి ఐడీ పార్టీ ఏఎస్సై శ్యామ్, హెచ్‌సీ మురళీకృష్ణ, పీసీ శ్రీరామ్‌లతో కలిసి కేసు విచారణ ప్రారంభించారు.

విచారణలో భాగంగా అదే ఇంటి సమీపంలో అద్దెకుంటున్న కురుపాం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన గొట్టిపల్లి దినేష్‌కుమార్‌ తన తాహతుకు మించి ఖర్చులు చేస్తున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోనే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారిద్దామనుకుంటుండగా పారిపోయేందుకు ప్రయతి్నంచగా సిబ్బంది వెంబడించి పట్టుకుని విచారించగా.. దొంగతనం తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. వంటింటి కిటికీ తలుపులు పూర్తిగా వేయకపోవడంతో అందులోంచి ప్రవేశించిన దినేష్‌కుమార్‌ ఉపాధ్యాయులు తమ మంచం పరుపుకిందనే బీరువా తాళాలు ఉంచేయడంతో ఎంచక్కా బీరువా తెరచి అందులోంచి 14 తులాల విలువైన ఏడు గాజులు, రెండు హారాలు, ఒక చైన్, తులం బంగారం ముక్క, వెండి గ్లాసులు దొంగిలించాడు.

వీటిని విక్రయించేందుకు తన స్నేహితుడైన శ్రీకాకుళం జిల్లా పిన్నింటిపేటకు చెందిన ఆనందరావును సంప్రదించడంతో వస్తువులు ఇక్కడకు తెస్తే అమ్మేద్దామని సహాయపడ్డాడు. ఈలోగానే దినేష్‌కుమార్‌ తన తల్లికి ఒంట్లో బాగాలేదని చెప్పి బొబ్బిలిలో మూడు గాజులను విక్రయించాడు. అలాగే గత నెల 29న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మూడు గాజులు, బంగారం ముక్కను అమ్మేసినట్టు విచారణలో తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విక్రయించిన సొత్తుతో పాటు, దినేష్‌ కుమార్‌ వద్ద ఉన్న బంగారం చైన్, ఇతర వస్తువులను రికవరీ చేసినట్టు వివరించారు. చోరీ సొత్తును కొద్దిరోజుల్లోనే రికవరీ చేయడంతో ట్రైనీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని, ఐడీ పార్టీ సిబ్బందిని ఎస్పీ రాజకుమారి అభినందించారని డీఎస్పీ పాపారావు తెలిపారు. చోరీకి పాల్పడిన విద్యార్థితోపాటు అతనికి సహకరించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement