చెన్నైలో గ్యాంగ్‌.. ఢిల్లీకి హెరాయిన్‌ | Delhi is the headquarters of the masterminds of the heroin syndicate | Sakshi
Sakshi News home page

చెన్నైలో గ్యాంగ్‌.. ఢిల్లీకి హెరాయిన్‌

Published Tue, Sep 21 2021 5:02 AM | Last Updated on Tue, Sep 21 2021 7:59 AM

Delhi is the headquarters of the masterminds of the heroin syndicate - Sakshi

విజయవాడ సత్యనారాయణపురం గడియారం వీధిలో ఆషి ట్రేడింగ్‌ కంపెనీ కార్యాలయం ఇదే..

సాక్షి, అమరావతి: హెరాయిన్‌ సిండికేట్‌ సూత్రధారుల కేంద్ర స్థానం ఢిల్లీ. చెన్నైలో ఉండే పాత్రధారులు కథ నడిపిస్తుంటారు. అఫ్గానిస్తాన్‌ నుంచి భారీగా హెరాయిన్‌ సరఫరా అవుతుండగా.. ఇరాన్‌ మీదుగా గుజరాత్‌కు దిగుమతి అవుతోంది. ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల్లో దానిని విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దేశంలోనే అతి పెద్ద హెరాయిన్‌ రాకెట్‌ ఈ దందా నడిపిస్తోంది. కానీ.. ఈ వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం లేని విజయవాడ పేరును వాడుకుంటోంది.

వెలుగులోకి విభ్రాంతికర వాస్తవాలు
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ అధికారులు భారీస్థాయిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్‌ఐ, కేంద్ర, రాష్ట్రాల పోలీసు వ్య వస్థల కళ్లుగప్పి దర్జాగా హెరాయిన్‌ దందా సాగిం చేందుకు ఈ సిండికేట్‌ వ్యూహాత్మకంగా యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేసిందని గుర్తించారు. అఫ్గానిస్తాన్‌ నుంచి భారీగా హెరాయిన్‌ దిగుమతి చేసిన ‘అషీ ట్రేడింగ్‌ కంపెనీ’ విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని ఓ ఇంటి చిరునామాతో రిజిస్టర్‌ కావడంతో ఈ కేసు రాష్ట్రంలోనూ సంచలనం సృష్టించింది. కాగా, హెరాయిన్‌ దందాతో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం డీఆర్‌ఐ అధికారులను, పోలీసులను తప్పుదా రి పట్టించేందుకే విజయవాడ చిరునామాను  ము ఠా వాడుకుందని వెల్లడైంది. గుజరాత్‌కు చేరిన భా రీ హెరాయిన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన అఫ్గాన్‌ జా తీయులు కొందర్ని డీఆర్‌ఐ అధికారులు అహ్మదా బాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన స మాచారం ఆధారంగా చెన్నైలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో వెల్లడైన ఆసక్తికర విషయాలు దేశంలో వేళ్లూనుకున్న హెరాయిన్‌ దందా తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

అఫ్గాన్‌ నుంచి.. ఇరాన్‌ మీదుగా..
దేశంలో హెరాయిన్‌ సిండికేట్‌ పక్కా ప్రణాళికతో అఫ్గానిస్తాన్‌ నుంచి దేశంలోకి భారీగా హెరాయిన్‌ ను దిగుమతి చేసుకుంటోందని డీఆర్‌ఐ తనిఖీల్లో వెల్లడైంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కొన్ని రోజులుగా డీఆర్‌ఐ అధికారులు జరుపుతున్న విస్తృ త తనిఖీల్లో భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.4,500 కోట్లు ఉంటుం దని మొదట భావించగా.. ఆదివారానికి రూ.9 వేల కోట్లుగా తేలింది. సోమవారం తనిఖీలు పూర్తయ్యేసరికి ఆ హెరాయిన్‌ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.21 వేల కోట్లు ఉంటుందని లెక్కతేల్చారు. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు చెందిన ‘హాసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ ఈ నెల 13, 14 తేదీల్లో ఈ హెరాయిన్‌ కన్‌సైన్‌మెంట్లను ప్రత్యేక కంటైనర్లలో ప్యాక్‌ చేసి ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు నుంచి గుజరాత్‌కు తరలించింది. టాల్కం పౌడర్‌ పేరిట భారీగా హెరాయిన్‌ ప్యాకెట్లను నౌకల్లో గుజరాత్‌లోని ముండ్రా పోర్టుకు చేర్చింది.

ఢిల్లీలో సూత్రధారులు.. చెన్నైలోపాత్రధారులు
సిండికేట్‌ సూత్రధారులు ఢిల్లీలోనూ, పాత్రధారులు చెన్నైలోనూ ఉంటూ ఈ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారుల విచారణలో తేలింది. గుజరాత్‌కు చేరిన హెరాయిన్‌ను ఢిల్లీ తరలించాలన్నది ఆ సిండికేట్‌ లక్ష్యం. ఢిల్లీలో తమ గిడ్డంగిలో భద్రపరచి..  ఢిల్లీతోపాటు చండీగఢ్, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లోని విక్రయదారులకు వివిధ మార్గాల్లో తరలించాలన్నది సిండికేట్‌ వ్యూహమని గుర్తించారు.

విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు
గుజరాత్‌లో డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు. చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు వైశాలి డీఆర్‌ఐ, పోలీసు అధికారుల కళ్లుగప్పేందుకు విజయవాడలోని ఇంటి చిరునామాను వాడుకున్నారు. ఆ చిరునామాతో అషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్ట్రేషన్‌ మాత్రమే చేయించారు. కానీ ఇక్కడ నుంచి ఆ సంస్థ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఆ దంపతులు ఎన్నో ఏళ్లుగా చెన్నైలోనే నివసిస్తున్నారు. గుజరాత్‌లో డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ను విజయవాడ తరలించడం స్మగ్లర్ల లక్ష్యం కాదని, ఢిల్లీకి తరలించాలన్నదే వారి లక్ష్యమని విచారణలో వెల్లడైంది. ఈ కేసులో డీఆర్‌ఐ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. 
   – బి.శ్రీనివాసులు, సీపీ, విజయవాడ 

బురిడీ కొట్టించేందుకే విజయవాడ చిరునామా
హెరాయిన్‌ సిండికేట్‌ డీఆర్‌ఐ, పోలీసు అధికారుల కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వాడుకుంది. ఈ సిండికేట్‌లో పాత్రధారులైన చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు దుర్గాపూర్ణ వైశాలి వ్యూహాత్మకంగా విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని 23–14–16 డోర్‌ నంబర్‌తో ‘అషీ ట్రేడింగ్‌ కంపెనీ’ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఎగుమతులు, గూడ్స్‌ సర్వీసులు, హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారం నిర్వహిస్తామని పేర్కొంటూ దుర్గాపూర్ణ వైశాలి పేరిట గతేడాది ఆగస్టు 10న జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ ఇల్లు దుర్గా పూర్ణ వైశాలి తల్లి తారక పేరున ఉంది. కానీ.. ఈ చిరునామా నుంచి ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేదు. కేవలం రికార్డుల్లో చూపించేందుకే ఈ చిరునామాను వాడుకున్నారు.

ఎప్పుడైనా డీఆర్‌ఐ అధికారులు తమ కన్‌సైన్‌మెంట్‌ను గుర్తిస్తే.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేశారు. అషీ ట్రేడింగ్‌ సంస్థ తన వ్యాపార లావాదేవీల ఇన్వాయిస్‌ వివరాలను తెలిపే జీఎస్టీ ఆర్‌–1ను ఫైల్‌ చేయకపోవడం గమనార్హం. కేవలం చెల్లింపు వివరాలకు సంబంధించిన జీఎస్టీ ఆర్‌–3బీని మాత్రమే త్రైమాసికంగా ఫైల్‌ చేస్తోంది. ఇదిలావుంటే.. ఆ సంస్థకు దిగుమతులు చేసుకునేందుకు సంబంధించి విజయవాడ చిరునామాతో ఎలాంటి లైసెన్స్‌ తీసుకోలేదు. కాబట్టి గుజరాత్‌ ముంద్రా పోర్టులో దిగుమతి అయిన హెరాయిన్‌తో విజయవాడకు వాస్తవంగా ఎలాంటి సంబంధం లేదని డీఆర్‌ఐ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది.

ఈ సిండికేట్‌ చెన్నై, ఢిల్లీ తదితర ప్రదేశాల్లో మరో చిరునామాతో దిగుమతుల లైసెన్స్‌ను తీసుకుని దందా సాగిస్తోందా అన్న దిశగా డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా, దుర్గాపూర్ణ వైశాలి తల్లి పేరిట విజయవాడలో గల ఇంటి ఆవరణలో పార్కింగ్‌ చేసి ఉన్న స్కూటర్‌ (ఏపీ 16 బీఎన్‌2268) గోవిందరాజు విద్యానాథ్, తండ్రి కోటేశ్వరశర్మ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఉంది. విజయవాడలోని ఆ చిరునామాలో కొంతకాలంగా ఎవరూ ఉండడం లేదు. గుజరాత్‌లో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్న అఫ్గాన్‌ జాతీయులు ఇచ్చిన సమాచారంతో చెన్నైలో ఉంటున్న అషీ ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ, చెన్నై కేంద్రాలుగా దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ రాకెట్‌ దందాపై డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement