నిందితుడు హేమంత్ దత్త - హత్యకు గురైన హేమంత్ నాయక్ (ఫైల్)
యశవంతపుర(కర్ణాటక): ఆన్‌లైన్‌లో ఐ ఫోన్ బుక్ చేసిన యువకుడు డబ్బులు ఎగ్గొట్టాలని ఏకంగా డెలివరీ బాయ్‌ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా అరసికెరెలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని లక్ష్మీపురకు చెందిన హేమంత్ దత్త (20) నిందితుడు. ఇతడు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ను బుక్ చేశాడు. డెలివరీ సమయంలో నగదు ఇచ్చే ఆప్షన్ పెట్టాడు.
అరసికెరె తాలూకాకు చెందిన డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ (23) ఈ నెల 11న ఫోన్‌ను తీసుకుని దత్త ఇంటికి వెళ్లాడు. అతడు ఫోన్‌ను తీసుకుని, ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తానని బాయ్‌ను కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం హేమంత్‌దత్త వెనుక వైపు నుంచి వచ్చి నాయక్‌పై కత్తితో పొడిచాడు. బలమైన గాయాలై రక్తస్రావంతో కుప్పకూలి అక్కడే మృత్యువాత పడ్డాడు.
ఇంట్లోనే మూడురోజులు
తరువాత మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి 14వ తేదీన గోనెసంచిలో శవాన్ని మూటగట్టి స్కూటర్‌పై తీసుకెళ్లి సమీపంలోని కొప్పలు రైల్వేగేట్ సమీపంలో పడేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు హేమంత్ నాయక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రైల్వేగేటు వద్ద కాలిన శవం ఉందని తెలిసి పోలీసులు వెళ్లి పరిశీలించగా అది హేమంత్ నాయక్ మృతదేహంగా గుర్తించారు. నాయక్ మొబైల్‌కు వచ్చిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా వెంటనే హేమంత్‌దత్తను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నోరు విప్పాడు.
కఠినంగా శిక్షించాలి
పోలీసులు అతని ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా హేమంత్‌దత్త స్కూటర్‌పై బంక్ వద్దకు వెళ్లి బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లిన దృశ్యాలను కనుగొన్నారు. హత్య చేసి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి హేమంత్‌దత్త అన్ని ప్రయత్నాలు చేశాడని ఎస్‌పీ హరిరామ్ శంకర్ తెలిపారు. ఈ దురాగతం స్థానికంగా సంచలనం కలిగింది. ఇటువంటి హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు.
చదవండి: భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. డబ్బు కొట్టేయాలని ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment