
ఆస్పత్రి సిబ్బందిని నిలదీస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
సాక్షి, మొయినాబాద్: ఆపరేషన్ చేసి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చారు డాక్టర్లు. పురుటి నొప్పులతో వచ్చిన మహిళకు శస్త్రచికిత్స చేసి కడుపులో కాటన్ వస్త్రం పెట్టి కుట్లు వేశారు. పది రోజుల తర్వాత తమతో కాదని చేతులెత్తేశారు. చివరికి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆపరేషన్ చేసి కాటన్ గుడ్డను బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాలివీ.. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన దండు మంగమ్మ డెలివరీ కోసం నవంబర్ 28న మండల పరిధిలోని భాస్కర ఆస్పత్రికి వెళ్లింది. 29న ఉదయం డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. ఆపరేషన్ సమయంలో కాటన్ గుడ్డను కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు.
పది రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచుకున్నారు. కుట్లు ఎంతకూ మానకపోవడంతోపాటు కడుపునొప్పి రావడంతో భర్త మాణిక్యం డాక్టర్లను ప్రశ్నించాడు. దీంతో ఎక్స్‌రేలు తీయిస్తూ, మందులు తెప్పిస్తూ కాలయాపన చేశారు. ఎంతకూ తగ్గకపోవడంతో చేసేదిలేక ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈనెల 8న అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు సైతం కాదని చెప్పడంతో అదే రోజు రాత్రి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు స్కానింగ్ చేసి కడుపులో ఏదో గుడ్డ ఉందని గుర్తించారు. శుక్రవారం ఆపరేషన్ చేసి బయటికి తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
చదవండి: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’!
డాక్టర్లను ప్రశ్నించిన భర్త మాణిక్యం
మాణిక్యం, బంధువులతో కలిసి శనివారం సాయంత్రం భాస్కర ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశారు. పెద్ద డాక్టర్లు లేరని.. సోమవారం వచ్చి మాట్లాడండి అంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లగొట్టారని మాణిక్యం ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంచందర్‌రావు వివరణ కోరగా రెండు రోజులుగా సెలవులో ఉన్నానని.. సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపడతామన్నారు.
చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు
Comments
Please login to add a commentAdd a comment