ప్రతీకాత్మక చిత్రం
పూణె : ఏటీఎంలను ట్యాంపరింగ్ చేసి వాటిలోని నగదును దొంగిలించారనే అభియోగంపై గత నెలలో పింప్రి చించ్‌వాడ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగిలించిన డబ్బులతో వారు ఎంహెచ్‌ఏడీఏలో ఫ్లాట్, బంగారం నగలు కొన్నట్లు తేలింది. అరెస్టు సమయంలో పోలీసులు వారి నుంచి రూ.66 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు ఏటిఎం తయారీ సంస్థలో పనిచేసిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ మనోజ్ సూర్యవంశీ(30), మరో మెకానికల్ ఇంజనీర్ భానుదాస్ కోల్టే ఇద్దరిపై గతంలో టెల్లర్ మిషన్లను పగులగొట్టి డబ్బు దొంగిలించిన కేసులున్నాయి. ఆ కేసుల్లో ఒక ఇంజినీర్‌తో సహా, వారి సహచరులు ఆరుగుర్ని అరెస్టు చేసి, వారి నుంచి రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్ బాబర్, అతని టీం ఈ దాడులు చేసి వారి నుంచి మూడు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
సూర్యవంశీ, కోల్టే ఇద్దరూ ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినవారు. వీరు తమ అనుచరులతో కలిసి 2017 డిసెంబర్ ఇప్పటి వరకు ఎనిమిది ఏటీఎంల నుంచి నగదు చోరీ చేశారు. చివరి సారిగా సెప్టెంబర్ 24న డిఘీలోని ఒక ఏటీఎంని దోచుకున్నారు. అరెస్టైన మిగతా ఆరుగురు నిందితులను కత్రాజ్‌కు చెందిన మహేష్ దేవ్నికర్(30), బారమతికి చెందిన సాగర్ తవారే(31), తుషార్ చంద్‌గుడే(25), పురందర్‌కు చెందిన శంకర్ గైక్వాడ్(31), చించ్‌వాడ్‌కు చెందిన ఆశిష్ భలేరావ్(22), లాతూర్ జిల్లాకు చెందిన నర్సింగ్ ధూమల్(22)గా గుర్తించారు. ఈ ముఠా గత మూడేళ్లలో పలు ఏటీఎంల నుంచి సుమారు రూ.94 లక్షలు దొంగిలించింది.
ఈ ముఠా ప్రధాన సూత్రధారి సూర్యవంశీ చోరీ నగదులో నుంచి రూ.10లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొన్నాడు. అతను ఆభరణాలను ఒక ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టాడని, ఆ సంస్థ నుంచి డిపాజిట్ రశీదులను స్వాధీనం చేసుకుని అతని నుంచి రూ.50 వేలు కూడా స్వాధీనం చేసుకున్నామని బాబర్ తెలిపారు. కోల్టే దొంగిలించిన డబ్బు నుంచి పింప్రి చించ్‌వాడ్‌లో రూ.12 లక్షల విలులైన ఫ్లాట్ కొన్నట్లు ఆయన తెలిపారు. ఫ్లాట్ కొన్న రశీదును కూడా స్వాధీనం చేసుకున్నామని, ధూమల్ నుంచి రూ.5.5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని బాబర్ తెలిపారు. మిగిలిన అయిదుగురు నిందితులు వైద్య బిల్లులు, వివాహం, వ్యవసాయ పనుల నిమిత్తం సుమారు రూ.7 లక్షలు ఖర్చు చేశారని బాబర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment