నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోంచి ఈడీ స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో సుదీర్ఘకాలం తరువాత ముందడుగు పడింది. తాజాగా ఈ కేసు లో నిందితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ప్రధాన నిందితులు మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి, కాంట్రాక్టర్ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లతో కలిపి దాదాపు ఏడు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే నిందితుల ఇళ్లలో ఏకకాలంలో మొదలైన తనిఖీలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిశాయి. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్ ముకుందరెడ్డి, అతని బావమరిది వినయ్‌రెడ్డి, ఏడు డొల్ల ఫార్మా కంపెనీల అధినేత బుర్రా ప్రమోద్‌రెడ్డి ఇళ్లల్లో భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.3 కోట్ల నగదు లభించిందని ఈడీ పేర్కొంది.
ఇందులో శ్రీనివాసరెడ్డి ఇంట్లో రూ.1.50 కోట్లు, ప్రమోద్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.15 కోట్లు, ఎం.వినయ్‌రెడ్డి ఇంటి నుంచి రూ.45 లక్షలు, రూ.కోటి విలువైన నగలు, ఖాళీ చెక్కులు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా కారణంగా మందకొడిగా సాగిన విచారణ ఈ దాడులతో మళ్లీ వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముగ్గురు కీలక నిందితులను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2015–2019 మధ్యకాలంలో దాదాపు రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అవినీతితోపాటు మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఏసీబీ నివేదిక(8 ఎఫ్‌ఐఆర్‌లు)తో ఈడీ రంగంలోకి దిగింది.
అసలేమిటీ కేసు..
ఈఎస్‌ఐలోని ఐఎంఎస్‌లో మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా 2019, సెప్టెంబర్‌లో ఏసీబీ రంగంలోకి దిగింది. అప్పటి డైరెక్టర్ దేవికారాణిని విచారణకు పిలిచి ఆమెతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 2015 నుంచి 2019 దాకా.. దాదాపు రూ.700 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అప్పటి డైరెక్టర్ దేవికారాణి, మాజీ డైరెక్టర్ పద్మ ఎక్కడా నిబంధనలు పాటించలేదని, మందుల సరఫరాకు టెండర్లు పిలవకుండా, అర్హతలేని కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఏసీబీ ఆరోపించింది. మందుల కొనుగోలుకు స్పష్టమైన మార్గదర్శకాలతో 2012లోనే ప్రభుత్వం జీవో నంబర్ 51ని విడుదల చేసింది. దాని ప్రకారం రిజిస్టర్డ్ కంపెనీలను మాత్రమే టెండర్లకు పిలవాలి.
అత్యవసర సమయాల్లో మాత్రమే నాన్ రిజిస్టర్డ్ కంపెనీలకు టెండర్లు ఇవ్వాలి. కానీ ఈ ఒక్క లొసుగును అడ్డంపెట్టుకుని దేవికారాణి, పద్మ, ఓమ్మీ ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీలు కథ నడిపారని ఏసీబీ గుర్తించింది. అర్హతలేని కంపెనీలకు చెందిన మందులను అధిక ధరలకు శ్రీహరిబాబు కోట్ చేయగా, వాటిని వీరిద్దరూ అంగీకరించేవారు. బదులుగా వీరిద్దరి ఖాతాల్లో రూ.కోట్లు వచ్చి చేరాయి. శ్రీహరిబాబుతో పాటు నిందితులంతా దాదాపుగా 100కు పైగా డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి సైతం కాంట్రాక్టులు దక్కించుకుని ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు.
చాలాసార్లు ఖాళీ ఇండెంట్లపై దేవికారాణి, పద్మ సంతకాలు చేయించుకుని తమకు నచ్చిన ధర వేసుకునేవారని ఏసీబీ గుర్తించింది. ఫలితంగా నిందితులంతా అనతికాలంలో అనేక చోట్ల భూములు, ప్లాట్లు, నగలు, నగదు కూడబెట్టారు. ఏసీబీ వారందరి చిట్టాను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన వారు, బినామీలు అంతా కలిసి దాదాపు 40 మంది నిందితుల జాబితాను ఏసీబీ రూపొందించింది. ఇందులో డైరెక్టర్ నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్ వరకు ఉండటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో విచారణ జరపాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది.
అవినీతి డబ్బుతో ఆస్తులు, జల్సాలు..
సాధారణంగా మార్కెట్ ధరకంటే ఏ సంస్థ తక్కువకు కోట్ చేస్తే వారికి టెండర్ ఇస్తారు. ఇక్కడ అసలు టెండర్లే లేవు. నచ్చిన వ్యక్తికి టెండర్లు లేకుండా అందులోనూ ఏకంగా మార్కెట్ రేటు కంటే 200 శాతం అదనపు ధరకు మందులు, మెడికల్ కిట్లను సరఫరా చేసే పనులను అప్పగించడం చూసి ఏసీబీ అధికారులే విస్మయం చెందారు. అలా ప్రభుత్వ సొమ్మును నచ్చిన కాంట్రాక్టరుకు దోచిపెట్టడం, వారిచ్చిన కమిషన్లతో వీరు ఆస్తులు కొన్నారు. విందులు–వినోదాలు, జల్సాలు, విదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం చేశారు. వీరి జీతాలెంత, కొన్న ఆస్తుల విలువెంత, ఐటీ ఎంత కట్టారనే వివరాలన్నింటినీ ఏసీబీ గతంలోనే సేకరించింది. ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ ఖాతాలో 2018లో ఏకంగా రూ.54 కోట్లు వచ్చి పడ్డాయి. అతనికి రూ.99 కోట్ల విలువైన షేర్లు, రూ.24 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 2017–18లో అతను ఆదాయపు పన్నుశాఖకు రూ.19 కోట్లు పన్ను రూపంలో చెల్లించడం గమనార్హం.
ఇతను లెజెండ్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్ రెడ్డి అనే బినామీని కూడా పెట్టాడు. ఇక దేవికారాణి తనకు వచ్చిన డబ్బును ఏకంగా రియల్ ఎస్టేట్‌లో పెటుబడులు పెట్టింది. ఆమె అనుచరులు కూడా రూ.కోట్లాది విలువైన విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2020, సెప్టెంబర్‌లో దేవికారాణి దాదాపు రూ.4.47 కోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులను తిరిగి స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు మూడు ఫార్మా కంపెనీలు ప్రారంభించేందుకు గతంలో ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం భూమి కూడా కొనుగోలు చేశారు. ఇక మరో కీలక నిందితుని ఇంట జరిగిన పెళ్లికి నిందితుడైన మరో పెద్దమనిషి దాదాపు కిలో బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించడం వీరి మధ్య అవినీతి బంధాన్ని చాటిచెబుతోంది. అంతేకాదు మరో నిందితుడు ఏకంగా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీని కూడా మొదలుపెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది.
మరి ఐఏఎస్ అధికారి సంగతేంటి?
ఈ కేసులో అప్పట్లో ఓ ఐఏఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఈఎస్‌ఐ సిబ్బంది గట్టిగా డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతున్నా సదరు అధికారి వీటిని తొక్కిపెట్టారని ఆరోపించారు. అంతేకాదు విజిలెన్స్ నివేదికలు బయటికి రాకుండా.. అవినీతి అధికారులకు సదరు అధికారి వత్తాసు పలికాడని, అసలు ఆయనే వీరిని చాలాకాలంగా కాపాడాడని ధ్వజమెత్తారు. నిందితులను సదరు అధికారి పరోక్షంగా సమర్థిస్తూ రాసిన లేఖలు లీకవడం కలకలం రేపింది. అదే సమయంలో ముకుందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు సదరు ఐఏఎస్ అధికారిని కూడా విచారించాలన్న డిమాండ్ వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. డిసెంబర్‌లో నిందితులను విచారించిన ఈడీ వారు చెప్పిన వివరాల ఆధారంగానే ముకుందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో విచారణ సాగిస్తోందని సమాచారం. ఇదే సమయంలో సదరు ఐఏఎస్ విషయంలో ఈడీ ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment