కట్టుకున్న భార్యను .. తల్లి, ప్రియురాలితో కలిసి.. | Extra Marital Affair: Husband Brutally Attacks On Wife In Odisha | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భార్యను .. తల్లి, ప్రియురాలితో కలిసి..

Published Sun, Nov 14 2021 10:30 AM | Last Updated on Sun, Nov 14 2021 10:30 AM

Extra Marital Affair: Husband Brutally Attacks On Wife In Odisha - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): భార్యకి విషమిచ్చి చంపేశాడో కసాయి భర్త. ఈ విషాద ఘటన జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–40 గ్రామంలో శనివారం వెలుగుచూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి, విచారణ సాగిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఎంవీ–40 గ్రామస్తుడైన సమీర్‌కు సరిగ్గా పదేళ్ల క్రితం ఎంవీ–57 గ్రామానికి చెందిన ఆశతో వివాహం జరిగింది.

అయితే 4 సంవత్సరాలుగా ఎంవీ–40 గ్రామానికి చెందిన ఓ మహిళతో సమీర్‌ అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో ఆశ తన భర్తని రోజూ నిలదీసేది. ఇదే విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చిన సమీర్‌ తన భార్యతో తొలుత గొడవకు దిగి, ఆమెతో బలవంతంగా విషం తాగించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన అత్తమామలకు ఫోన్‌ చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని సమాచారమిచ్చాడు.

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాధిత తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో పడి ఉన్న తమ కూతురిని వైద్యసేవల నిమిత్తం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఆమె శనివారం ఉదయం కన్నుమూసింది. కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి, విచారణ చేస్తున్నారు.

ఆశను హతమార్చేందుకు సమీర్‌కి తన తల్లి, ప్రియురాలు కూడా సహాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కలిమెల సమితి, ఎంవీ–66 గ్రామంలో కజాల్‌ అనే మరో మహిళ ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన కలిమెల పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement