ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కొణిజర్ల (ఖమ్మం): ఆ యువకుడు గ్రామానికే చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఆమె ఇంటికి వెళ్లి వస్తూ అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ సంబంధం కొనసాగించాడు. ఆ తర్వాత క్రమంలో మద్యానికి బానిసైన ఆయన వివాహితను వేధించడం ఆరంభించాడు. దీంతో ఆమె తన భర్తతో కలిసి యువకుడిని మట్టుపెట్టడమే కాకుండా ప్రమాదవశాత్తు మరణంగా చిత్రీకరించాలని యత్నించారు. కానీ పోలీసుల దర్యాప్తులో భార్యాభర్తలు కలిసి హత్య చేసినట్లు తేలగా సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కూలీకి వెళ్తుండగా పరిచయం..
కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చందా ఎల్లారావు(22) తరచుగా గ్రామంలోని రైతుల పొలాల్లో పనిచేసేందుకు కూలీలను తీసుకెళ్లేవాడు. ఇలా మహిళా కూలీలను తీసుకెళ్లే క్రమంలో ఆయనకు గ్రామానికే చెందిన వివాహిత బానోత్ శివపార్వతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో తరుచూ శివపార్వతి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఆమె కూడా అతని నుంచి డబ్బు తీసుకునేది.
కొన్నాళ్లకు శివపార్వతి భర్త రామారావుకు విషయం తెలిసినా భార్యలో మార్పు వస్తుందిలేనని పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇటీవల ఎల్లారావు మద్యానికి బానిసై శివపార్వతిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె భర్తతో కలిసి యువకుడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 4వ తేదీ అర్ధరాత్రి ఎల్లారావు మద్యం సేవించి రామారావు ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు.
దీంతో శివపార్వతి తలుపు తీసి మెడ వంచగానే ముందుగా సిద్ధం చేసుకున్న రోకలి బండతో ఎల్లారావు మెడ, తలపై రామారావు కొట్టడంతో కింద పడిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మృతదేహాన్ని రామారావు తన సొంత ఆటోలో వేసుకుని అంగన్‌వాడీ సెంటర్ సమీపాన వెదురు పొదల వద్ద పడేశాడు. ఎవరైనా చూస్తే తాగిపడి చనిపోయి ఉంటాడనుకునేలా చిత్రీకరించి వెళ్లిపోయాడు.
కాగా ఉదయాన్నే మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వైరా ఏసీపీ స్నేహమెహ్రా, సీఐ వసంత్‌కుమార్, ఎస్‌ఐ టీ.వై.రాజు పరిశీలించి దర్యాప్తు ఆరంభించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానంతో ఆరా తీసి శివపార్వతి, రామారావును సోమవారం అదుపులోకి తీసుకోగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రోకలి బండ స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం ఖమ్మం కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment