నిందితులు
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధమే మహిళ హత్యకు దారితీసింది. మే 27న షాబాద్ పహిల్వాన్ చెరువులో పడి మృతి చెందిన ఓ మహిళ కేసును పోలీసులు మొదట అనుమానాస్పద ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసి విచారణ చేయగా ఇది హత్యగా తేలింది. సదరు మహిళతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తే హత్యచేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో షాబాద్ పోలీసులు సోమవారం ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
షాబాద్ సీఐ అశోక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పహిల్వాన్ చెరువులో మే 27న బైండ్ల భారతమ్మ(30) మృతదేహం లభించిన విషయం విదితమే. అయితే పోలీసులు అమె మృతికి సంబంధించిన విషయాలు తెలియకపోవటంతో అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా ఈ కేసులో ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్న షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్, అతనికి సహకరించిన కమ్మరి లక్ష్మీబాయి, స్నేహితుడు సయ్యద్ సాదుల్లా హుస్సేన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు.
పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్ 15ఏళ్లుగా చికెన్‌షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. కానీ ఇతనికి పెళ్లికి ముందు నుంచే మృతురాలు బైండ్ల భారతమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఈ విషయం నలుగురికి తెలిసి పరువు పోతుందనే భయంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత నెల 22న ఆమె గపూర్‌కు పోన్ చేయటంతో ఆమెను షాబాద్‌కు రమ్మనాడు. షాబాద్‌లో అతనికి తెలిసిన కుమ్మరి లక్ష్మీబాయి ఇంటికి పిలిపించాడు.
చదవండి: మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా..
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడే ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న 3 గ్రాముల పుస్తెను సహకరించినందుకు లక్ష్మీబాయి తీసుకుంది. మృతదేహాన్ని తన స్నేహితుడైన సయ్యద్ సాదుల్లా హుస్సేన్ సహాకారంతో గోనే సంచిలో పెట్టుకొని స్కూటర్‌పై తీసుకెళ్లి షాబాద్ పహిల్వాన్ చెరువులో పడేశాడు. కానీ పోలీసులు మృతురాలి ఫోన్‌కాల్ డాటా ఆధారంగా ఆరోజు ఆమె చేసిన ఫోన్ నెంబర్‌ల ఆధారంగా కేసు విచారించారు. దీంతో చివరిగా చేసిన ఫోన్ గపూర్‌ది కావటంతో అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఆయనతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment