సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్): కష్టాల్లో నుంచి వచ్చిన వారిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి సంపాదించుకున్నారు. జీవితంలో స్థిరపడ్డామని సంతోషించేలోపే భర్త పక్కదారి పట్టాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా మారని భర్త తీరుతో విసిగిన ఆ భార్య ఏకంగా సుపారీ ఇచ్చి మరీ.. హత్యచేయించింది.
ఆ శవమే ఈనెల 23న నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకపూర్ సమీపంలోని వాగులో లభ్యమైంది. అన్నికోణాల్లో విచారణ చేసిన జిల్లా పోలీసులు వారం రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లో కలుసుకుని..
కంచికట్ల శ్రీనివాస్(42) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుచానూరు. తనకంటూ ఎవరూ లేని అనాథ కావడంతో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుతూ స్థిరపడ్డాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట్ గ్రామానికి చెందిన స్వప్నకు పెళ్లై.. ఓ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుంది.
అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఓ బట్టల దుకాణంలో పనిలో చేరింది. ఈక్రమంలో శ్రీనివాస్, స్వప్నల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమపెళ్లికి దారితీసింది. వీరికి కొడుకు, బిడ్డ జన్మించారు. సంపాదించిన డబ్బులతో మరో ఆటో కొన్నారు. అక్కడే స్నేహితుల ద్వారా క్రమంగా శ్రీనివాస్ రియల్‌ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో కలిసిరావడంతో ఉప్పల్ ఒక ఇల్లు, వేంపేట్‌లో మరో ఇల్లు నిర్మించుకున్నారు. ఇక అంతా బాగానే ఉంది.. చక్కగా స్థిరపడ్డాం.. అనుకునేలోపే వారి ప్రయాణం మరో మలుపు తిరిగింది.
ఆమె రాకతో..
ఆర్థికంగా స్థిరపడ్డ శ్రీనివాస్ విలాసాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో నందిని అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి స్వప్న ఆత్మహత్యాయత్నం వరకూ వెళ్లడంతో నందిని దూరంపెట్టాడు. కానీ.. ఆ కోపం ప్రతిరోజూ తాగివచ్చి భార్యాపిల్లలపై చూపేవాడు. నిత్యం తాగొచ్చి తనతోపాటు తన పిల్లలను శ్రీనివాస్ హింసించేవాడు.
దీంతో విసిగిపోయిన స్వప్న భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది. తన కొడుకులు తరుణ్, రాజ్‌కుమార్, తన అక్క కొడుకు పోశెట్టికి భర్తను మట్టుపెట్టాలని కోరింది. హత్య చేయడం తమతో కాదని, ఇతరులకు సుపారీ(డబ్బులు) ఇచ్చి అంతమొందిద్దామని వారు సలహా ఇచ్చారు. ఈమేరకు పోశెట్టి తమ్ముడు చిక్కా అలియాస్ ప్రవీణ్‌కుమార్ ద్వారా సుపారీ గ్యాంగ్‌ను హైదరాబాద్‌కు పిలిపించారు. రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
పథకం ప్రకారం వేంపేట్‌కు..
హైదరాబాద్‌లో హత్యచేస్తే సులభంగా దొరికిపోతామని, మృతదేహం తరలించడం కూడా కష్టమవుతుందని సుపారీ గ్యాంగ్ చెప్పడంతో మర్డర్ స్పాట్‌ను వేంపేట్‌కు మార్చారు. ఈమేరకు ఈనెల 22న రాత్రి వేంపేట్‌కు వెళ్దామని భర్త శ్రీనివాస్‌ను తీసుకుని కుటుంబ సమేతంగా రాత్రి 9 గంటలకు వచ్చారు.
ఈ సమాచారాన్ని ప్రవీణ్‌కుమార్ ద్వారా సుపారీ గ్యాంగ్ సభ్యులైన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపే, నిర్మల్ జిల్లా ఖానాపూర్, మెదక్ జిల్లాకు చెందిన బాణాల అనిల్, కంచర్ల మహావీర్, మ్యాతరి మధు, కొలనూరి సునీల్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్‌కు అందించారు. వీరంతా గంట వ్యవధిలో వేంపేట్‌కు చేరుకున్నారు.
మర్డర్ ప్లాన్ తన కుమార్తెకు విషయం తెలియనివ్వకుండా స్వప్న ఆ రోజు రాత్రి ఆమెను పక్కింట్లో పడుకోబెట్టింది. రాత్రి 11 గంటలకు సుపారీ గ్యాంగ్ స్వప్న ఇంటికి వచ్చింది. నిద్రపోతున్న శ్రీనివాస్‌పై గ్యాంగ్‌తోపాటు కొడుకులు, భార్య రోకలిబండ, కర్రలతో బలంగా కొట్టడంతో చనిపోయాడు. అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదనడంతో సుపారీగ్యాంగ్ మృతుడి ఒంటిపై ఉన్న అభరణాలను తీసుకెళ్లారు.
తనిఖీలు ఉండడంతో..
శ్రీనివాస్ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి నిర్మల్ జిల్లాలోని అటవీప్రాంతంలో పూడ్చేసేందుకు పోశెట్టి, రాజ్‌కుమార్, చిక్కా ముగ్గురు కారులో బయలుదేరారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ అటవీశాఖ కేంద్రం వద్ద తనిఖీలు చేస్తుండటంతో దొరికిపోతామని భయపడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కనకాపూర్ వాగులో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.
శ్రీనివాస్ కనిపించకపోవడంతో అడిగినవాళ్లకు ఆయన హైదరాబాద్ వెళ్లినట్లు స్వప్న చెబుతూ వచ్చింది. ఈనెల 23న గుర్తుతెలియని శవంగా బయటపడిన ఘటనను స్థానిక పోలీసులు నమోదు చేసుకుని నిర్మల్‌తోపాటు జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకూ సమాచారం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా జిల్లాల్లోనూ శ్రీనివాస్ ఫొటో ద్వారా ఆరాతీయించి సఫలమయ్యారు.
తమకు అందిన సమాచారం మేరకు మొత్తం కూపీలాగి ఈ ఘటనలో మొత్తం 13 మందిని నిందితులుగా తేల్చారు. ఇందులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశారు. వెంకటేశ్, శ్రీకాంత్, రాజేందర్ పరారీలో ఉన్నారు. హత్యకు ఆయుధాలు, మృతదేహం తరలింపునకు ఉపయోగించిన కారు, నిందితులు ఉపయోగించిన పది సెల్‌ఫోన్లు, మృతుడికి చెందిన 72 గ్రాముల అభరణాలు, రూ.75వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వివరించారు. తక్కువ వ్యవధిలో ఈ కేసును ఛేదించిన సోన్ సీఐ రాంనర్సింహారెడ్డి, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్ రూరల్ ఎస్సైలు రాహుల్, వినయ్, అశోక్, సిబ్బందిని అభినందించారు.
చదవండిః మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment