ప్రొద్దుటూరు క్రైం: వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ హత్య ఘటనలో సొంత బంధువే నిందితుడు. సంచలనం సృష్టించిన కానపల్లె హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రొద్దుటూరు మండలం కానపల్లె ఎస్సీ కాలనీలో శుక్రవారం వేకువ జామున మిద్దెపై నిద్రిస్తున్న ఆకుమల్ల నాగేంద్రబాబును గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. మృతుడి భార్య ఇమాంబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులోని నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది.
అరెస్ట్ వివరాలను శనివారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించారు. మృతుడు ఆకుమల్ల నాగేంద్రబాబుకు అతని సమీప బంధువు నగేష్‌లకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలియడంతో నగేష్ను దగ్గరికి రానివ్వద్దని నాగేంద్రబాబు మహిళను హెచ్చరించాడు. ఇంకోసారి అతన్ని రానిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నాగేంద్రబాబును ఎలాగైనా చంపి తమకు అడ్డు లేకుండా తొలగించుకోవాలని నగేష్ మహిళతో కలిసి కుట్ర పన్నాడు. ఈ క్రమంలో కానపల్లెలోని ఎస్సీ కాలనీలో గంటా మరియమ్మ ఇంటిపై నిద్రపోతున్న ఆకుమల్ల నాగేంద్రబాబును శుక్రవారం వేకువ జామున 4.30 గంటల సమయంలో నగేష్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
టెక్నాలజీ సాయంతో నిందితుల గుర్తింపు..
హత్య జరిగిన తర్వాత దర్యాప్తు కోసం సీఐలు నారాయణయాదవ్, ఇబ్రహీం, ఎస్‌ఐలు చిరంజీవి, శివప్రసాద్‌లతో కూడిన ప్రత్యేక టీంను జిల్లా ఎస్పీ అన్బురాజన్ నియమించారు. ఈ క్రమంలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు టెక్నాలజీ ద్వారా హత్య కేసులో పురోగతి సాధించారు. ఈ కేసులోని నిందితులునగేష్ తో పాటు మహిళను శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు.
వారి నుంచి రెండు సెల్‌ఫోన్లతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాదీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించనున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ కేసులో మంచి ప్రతిభ కనబరచిన పోలీసు బృందాన్ని ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. కాగా హత్య కేసులోని నిందితుడు డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. సొంత బంధువే హత్య చేశాడని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment