
అబ్దుల్లాపూర్‌మెట్: కూతురు నిశ్చితార్థం జరుగుతుండగానే గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. యాదగిరిగుట్టకు చెందిన శ్రీనివాస్‌గౌడ్(55) 30 సంవత్సరాల కిందట అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామానికి వచ్చి స్థానికంగా ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. శ్రీనివాస్ కూతురు వివాహ నిశ్చితార్థ వేడుకను ఆదివారం స్థానిక బీసీకాలనీలోని ఆయన ఇంటి వద్ద నిర్వహిస్తుండగా కార్యక్రమ మధ్యలో శ్రీనివాస్‌గౌడ్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు.
దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆనందంగా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి కన్నీటిపర్యంతమయ్యారు.