మోసపూరితంగా ‘హెచ్‌1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..! | Federal Court File Case On Cloudzen For False H1B Visa Issue | Sakshi
Sakshi News home page

మోసపూరితంగా ‘హెచ్‌1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..!

Published Fri, Jun 4 2021 2:39 AM | Last Updated on Fri, Jun 4 2021 7:05 AM

Federal Court File Case On Cloudzen For False H1B Visa Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో పని చేయాలను కొనే భారతీయ వృత్తి నిపుణులకు హెచ్‌1–బీ వీసాలను అక్రమ మార్గాల్లో మంజూరు చేయిస్తూ క్లౌడ్‌జెన్‌ ఎల్‌ఎల్‌సీ అనే టెక్నాలజీ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ‘బెంచ్‌ అండ్‌ స్విచ్‌’ పద్ధతిలో ఈ సంస్థ సాగించిన కుంభకోణం అమెరికా టెక్సాస్‌ లోని హ్యూస్టన్‌ నగరంలో వెలుగుచూసింది. ప్రస్తు తం అక్కడి ఫెడరల్‌ కోర్టులో ‘క్లౌడ్‌జెన్‌’పై వీసాల దుర్వినియోగం అభియోగాల కేసు నడుస్తోంది.

మే 28న జరిగిన వాదనల్లో ‘క్లౌడ్‌జెన్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌ జొమాన్‌ చొక్కలక్కల్‌ తాము మోసపూరితంగా పలువురికి హెచ్‌1–బీ వీసాలు ఇప్పించినట్లు న్యాయస్థానంలో అంగీకరించారు. ఈ కేసులో సెప్టెంబర్‌ 16న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సంస్థకు సుమారు 10 లక్షల డాలర్ల జరిమానా, ఐదేళ్లపాటు అవకాశం ఉంది. ఈ వ్యవహారం అక్కడి ఎన్‌ఆర్‌ఐలలో పెద్ద దుమారమే రేపుతోంది. రొమేనియా, కెనడా కేంద్రంగా నడుస్తున్న క్లౌడ్‌జెన్‌ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఒక శాఖ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనూ ఉంది. ప్రస్తుతానికి ఈ సంస్థ మూతబడింది.

కుంభకోణం జరిగింది ఇలా..
అమెరికా కేంద్రంగా నడిచే పలు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్‌1–బీ వీసాలు మంజూరు చేస్తారు. నిబంధనల ప్రకారం ముందుగా అక్కడ ఉన్న కంపెనీలతో ‘క్లౌడ్‌జెన్‌’ ఒప్పందం చేసుకొని నిపుణులను సరఫరా చేయాలి. ఏదైనా కంపెనీ ఫలానా వృత్తి నిపుణుడు కావాలని కోరినప్పుడు మాత్రమే అందుకు అర్హుడిని గుర్తించాలి. ఆపై వీసా ప్రాసెసింగ్‌ పూర్తి చేసి వారిని అమెరికా తీసుకువెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. కానీ ‘క్లౌడ్‌జెన్‌’ మాత్రం నకిలీ కాంట్రాక్టులను లేబర్‌ డిపార్ట్‌మెంట్, హోంల్యాండ్‌ సెక్యూరిటీకి సమర్పించి అనుమతులు పొందేది. ఈ అనుమతులతో హెచ్‌1బీ వీసాలు దరఖాస్తు చేసేది. ఇలా వీసాలు లభించగానే భారతీయ నిపుణులను అమెరికా పంపేది.

కానీ నిజంగా చేసేందుకు ఉద్యోగాలు లేకపోవడంతో వారికి అవసరమైన ఉద్యోగాలను వెతికిపెట్టే పని కూడా ‘క్లౌడ్‌జెన్‌’ చేసేది. విదేశీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉండటంతో (బెంచ్‌) ఆ తర్వాత కాలంలో అమెరికా కంపెనీలకు అవసరమైన నిపుణులను వెంటనే అందించేది. ఇలా అక్కడి మార్కెట్‌లో అయాచిత లబ్ధి పొందేది. అప్పుడు ఆయా సంస్థలు భారతీయ వృత్తి నిపుణుల తరఫున ఇమ్మిగ్రేషన్‌ పత్రాలను (స్విచ్‌) సమర్పించేవి. ఉద్యోగాలు పొందిన భారతీయ వృత్తి నిపుణుల నుంచి ‘క్లౌడ్‌జెన్‌’ కమిషన్‌ తీసుకొనేది. ఇలా 2013 మార్చి నుంచి 2020 డిసెంబర్‌ వరకు సుమారు 5 లక్షల డాలర్లను క్లౌడ్‌జెన్‌ సంపాదించింది. ఈ కంపెనీకి శశి పల్లెంపాటి ప్రెసిడెంట్‌గా, వైస్‌ ప్రెసిడెంట్‌గా జొమాన్‌ చొక్కలక్కల్, సుదీప్‌ చందక్‌ వ్యవహరిస్తున్నారని సంస్థ వెబ్‌సైట్‌ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement