ఢిల్లీ– చెన్నై మార్గంలో నిలిచిపోయిన రైళ్లు
రాఘవాపూర్–రామగుండం మధ్యలో ప్రమాదం
ఘజియాబాద్‌కు స్టీల్ లోడుతో వెళుతున్న గూడ్స్
పూర్తిగా ధ్వంసమైన రైల్వే లైన్స్, కరెంట్ స్తంభాలు
పునరుద్ధరణకు 24 గంటలు పట్టే అవకాశం
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్ రైలు మంగళవారం పట్టాలు తప్పటంతో ఢిల్లీ–చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి.
దీంతో ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడు లైన్లు ధ్వంసం
కన్నాల గేట్ వద్ద 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్–బల్లార్షా మధ్య ఉన్న మూడు రైల్వే లైన్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి.
రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. పునరుద్ధరణ పనులు రాత్రి 11 గంటల తరువాత మొదలయ్యాయి. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు.
వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment