క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న రైల్వే జీఎం అశోక్‌కుమార్ జైన్
ఒకలైన్ అందుబాటులో తెచ్చేందుకు యత్నం
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: ధ్వంసమైన మూడు ట్రాక్‌లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ఐరన్ కాయల్స్ లోడ్‌తో వెళుతున్న 44 వ్యాగన్లు ఉన్న గూడ్సు రైలు మంగళవారం రాత్రి రామగుండం–రాఘవాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య కన్నాల గేట్ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.
బుధవారం రాత్రి వరకు ఒక ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. వందలాదిమంది కూలీలు, భారీయంత్రాలను వినియోగించి పట్టాలపై పడిపోయిన వ్యాగన్లను తొలగించారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
39 రైళ్లు రద్దు.. 61 రైళ్లు దారిమళ్లింపు
కాజీపేట–బల్హార్షా మీదుగా నడిచే 39 రైళ్లను పూర్తిగా, 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు.. 61 రైళ్లను దారిమళ్లించారు. మరో 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎలాంటి సౌక ర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ స్టేషన్లలోని ప్రయాణికులు సమీప ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకోవడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి.
రామగుండం మీదుగా దేశవ్యాప్తంగా నిత్యం ప్ర యాణించేవారు వేల సంఖ్యలో ఉంటారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న వారు రైళ్ల రద్దుతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రయాణికులకు సేవలు అందించడం, సమాచారం తెలియజేయడానికి రామగుండం రైల్వేస్టేషన్‌లో అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
ప్రమాదాన్ని గుర్తించలేదా?
ఇటీవల ట్రాక్‌ల సామర్థ్యం పెంచారు. దీంతో గూడ్సు రైలు ప్రమాదానికి వేగం కారణం కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కు వ ఉంటే పట్టాలు సంకోచ, వ్యాకోచాలకు లోనవుతాయని, ప్రమాద సమయంలో ఉష్ణో గ్రతలు ఆ స్థాయిలో లేవని వారు అంచనా వేస్తున్నారు.
రైలు ఇంజిన్ నుంచి తొమ్మిదో నంబరు వ్యాగన్ పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. ప్రమాదాన్ని పసిగట్టని లోకోపైలెట్ వేగం తగ్గించకుండా ముందుకు వెళ్లడంతో పట్టాలు తప్పిన 11 వ్యాగన్లు సుమారు కిలోమీటరు పొడవున అలాగే వెళ్లిపోయాయా? దీంతోనే భారీ నష్టం వాటిల్లిందా? లేదా మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో డివిజినల్ సేఫ్టీ కమిటీతో పాటు రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
దిక్కుతోచడం లేదు
మా సొంతూరు వెళ్లేందుకు సంతోషంగా రైలెక్కిన. పెద్దపల్లి నుంచి కరీంనగర్, నిజామాబాద్, నాగపూర్ మీదుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తే గమ్యస్థానం చేరుకునేవాడిని. రైళ్ల గురించి అడిగితే అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. – ప్రధాన్, ప్రయాణికుడు, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్
12 గంటల ప్రయాణమైంది
దాణాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ వెళ్లాలి. స్టేషన్‌కు వచ్చాక రైళ్ల రద్దు విషయం తెలిసింది. రిజర్వేషన్ ప్రయాణికులకు రైల్వేశాఖ సెల్‌నంబర్లు ఇస్తే బాగుంటుంది. బస్సులో నాగ్‌పూర్ వెళ్తున్న. రూ.500 ఖర్చుతో ఆరు గంటల్లో మా ఊరు చేరుకునేవాడిని. రైళ్ల రద్దుతో రూ.2వేల ఖర్చు, 12 గంటల సమయం పడుతుంది. – సత్యం, ప్రయాణికుడు, నాగ్‌పూర్, మహారాష్ట్ర
Comments
Please login to add a commentAdd a comment