
నిందితులు ఉపయోగించిన వాహనం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘ఆ పిల్ల చూడు మస్తుగ ఉంది’ అంటూ ఓ బాలికను కామెంట్ చేసిన వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన కె.వెంకట్రామిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నాంపల్లి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు 2019 జూలై 25న అతడికి 14 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాంటిది.. రొమేనియా బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం పోలీసులు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జూబ్లీహిల్స్‌లో ఉన్న అమ్నీషియా పబ్ నుంచి బెంజ్ కారు (టీఎస్ 09 ఎఫ్‌ఎల్ 6460)లో రొమేనియన్ బాలికను ఎక్కించుకుని.. బంజారాహిల్స్‌లోని కాన్‌సీయూ బేకరీకి తీసుకెళ్తున్న సమయంలోనే సదరు ఎమ్మెల్యే కుమారుడు ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా ఉన్న వీడియోలు శనివారం వెలుగుచూశాయి. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర అంశాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించినా.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అతడిని తప్పించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సామూహిక అత్యాచారం కేసులో మిగతా ముగ్గురినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రేప్ జరిగిన ఇన్నోవా కారును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
బెంజ్ కారులో ఆమెతో పాటు నలుగురు!
బంజారాహిల్స్‌లో నివాసం ఉండే రొమేనియా దేశానికి చెందిన బాలికకు అమ్నీషియా పబ్‌లోనే సాదుద్దీన్ మాలిక్, ఉమేర్‌ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడు సహా ముగ్గురు మైనర్లతో పరిచయమైంది. అక్కడే వీరితోపాటు సదరు ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్టు సమాచారం. పబ్‌లో పార్టీని నాన్ ఆల్కహాలిక్ లంచ్‌గా బుక్ చేసుకున్నప్పటికీ వీరు మాత్రం తమతో తెచ్చుకున్న మద్యం తాగినట్టు తెలుస్తోంది. వారు బాలికతో పబ్ బయటికి వచ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తర్వాత నలుగురు కలిసి తమ బెంజ్ కారులో బాలికను ఎక్కించుకుని కాన్‌సీయూ బేకరీ వద్దకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు ఇన్నోవా కారులో అనుసరించారు.
‘అసలు కేసు’లో అతడూ నిందితుడే..
రెండు వాహనాలు బేకరీ వద్దకు చేరుకునే లోపు మార్గమధ్యలోనే వెనుక సీటులో కూర్చున్న ఎమ్మెల్యే కుమారుడు సదరు బాలికతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా ఉన్న వీడియోలు బయటికి వచ్చాయి. గత నెల 31న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన అసలు కేసు కూడా ఇలా అభ్యంతరకర, అసభ్య ప్రవర్తనకు సంబంధించినదే. పోక్సో చట్టం కింద నమోదైన ఆ కేసులో ఎమ్మెల్యే కుమారుడూ నిందితుడే. తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలతో కేసులో సామూహిక అత్యాచారం సెక్షన్‌ను జోడించారు. ఇక మిగతా నిందితులు బేకరీ వద్ద నుంచి బాలికను ఇన్నోవా కారులో తీసుకువెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కుమారుడు కూడా వారితో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఓ ఫోన్‌కాల్ రావడంతో బెంజ్ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడని.. ఈ లెక్కన అతడికీ అత్యాచారం చేయాలనే ఉద్దేశం ఉందనేది స్పష్టమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో అతడి కదలికలు కనిపించినా పోలీసులు మాత్రం వదిలిపెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది.
తప్పించుకునేందుకు అతి తెలివి!
కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిలో సాదుద్దీన్‌తోపాటు వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడిని శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. శనివారం మరో మైనర్‌ను పట్టుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి.. సాదుద్దీన్‌ను జైలుకు, మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. అయితే పరారీలో ఉన్న ఉమేర్, మరో మైనర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతి తెలివి ప్రదర్శించారు. ఓ వ్యక్తికి తమ సెల్‌ఫోన్లు ఇచ్చి గోవా పంపారు. టవర్ లోకేషన్ ద్వారా తాము గోవాలో ఉన్నట్టు భావించి పోలీసులు అక్కడికి వెళ్లి వెతుకుతారని.. ఇక్కడ తాము తప్పించుకోవచ్చని భావించారు. కానీ సాంకేతిక ఆధారాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు తమను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని గుర్తించారు. ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలించి వారిని తమిళనాడు, కర్ణాటకల్లో పట్టుకుని.. హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.
కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల పార్టీ!
ఇక అమ్నీషియా పబ్‌లో జరిగిన పార్టీ ఓ కార్పొరేట్ స్కూల్‌కు సంబంధించిన ఇంటర్ (10 ప్లస్ టూ) విద్యార్థుల ఫేర్‌వెల్ పార్టీగా తెలుస్తోంది. దీనికోసం నిసాన్, ఆదిత్య, ఇషాన్ అనే విద్యార్థులు రూ.2 లక్షలు చెల్లించి పబ్‌ను బుక్ చేసినట్టు సమాచారం. వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థులు పార్టీ కోసం పబ్‌ను ఎంచుకోవడం, దానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కారులో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి..
ఈ నేరంలో నిందితులు రెండు కార్లు వినియోగించారు. అమ్నీషియా పబ్ నుంచి బేకరీ వరకు బాలికను బెంజ్ కారులో తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఇన్నోవా కారులో తీసుకువెళ్లి పెద్దమ్మ గుడి చుట్టుపక్కల రెండు ప్రాంతాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకచోట సాదుద్దీన్, మరో మైనర్.. రెండో ప్రాంతంలో ఉమేర్, మిగతా ఇద్దరు మైనర్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఎమ్మెల్యే కుమారుడు వినియోగించిన బెంజ్ కారు వారి సమీప బంధువు పేరిట ఉంది. సీసీ ఫుటేజీల ద్వారా ఆ కారును గుర్తించిన పోలీసులు.. మూడు రోజుల క్రితమే స్టేషన్‌ను రప్పించి సీజ్ చేశారు. ఇక ఇన్నోవా కారును వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొన్నారని.. ఇంకా రిజిస్ట్రేషన్ నంబర్ రాని ఆ కారుపై ప్రభుత్వ వాహనం అని రాసి ఉందని తెలిసింది. ఈ కేసులో కీలకమైన ఈ కారును నిందితులు జడ్చర్ల సమీపంలో దాచారు. పోలీసులు శనివారం ఆ కారును రికవరీ చేసి.. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పలు నమూనాలు, ఆధారాలు సేకరించారు. వీటితోపాటు నిందితుల నుంచి తీసుకున్న శాంపిల్స్‌ను డీఎన్‌ఏ పరీక్షలకు పంపనున్నారు. పోలీసులు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను, దానిపై రాసి ఉన్న ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ను తొలగించినట్టు తెలిసింది.
వీడియోలు బయటికి రావడంతో..
రొమేనియన్ బాలికపై అత్యాచారం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే దర్యాప్తులో పోలీసుల తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. మరోవైపు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. దీనితో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుల ఫోన్లలో ఉన్న వాటిని పోలీసులు ఎవరైనా లీక్ చేశారా? లేక నిందితులే తమ స్నేహితులు లేదా వ్యక్తిగత సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టు చేశారా? అనేది ఆరా తీస్తున్నారు. ఈ పరిణామంతో శనివారం మధ్యాహ్నం నిఘా విభాగం అధికారులు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులతో సమావేశమయ్యారు.