గచ్చిబౌలి: పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన పప్పల సతీష్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పని చేస్తూ జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని 32సీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం భార్య బాలమణి (31)తో కలిసి ఇద్దరు ఒకే గదిలో నిద్రపోయారు.
బుధవారం ఉదయం 5.30 గంటలకు కుమారుడు చిద్విలాస్(7) తల్లి కనిపించకపోవడంతో ఏడుస్తూ హాల్‌లోకి వెళ్లాడు. పిల్లాడి ఏడుపు విన్న సతీష్ లేచి భార్యను పిలువగా పలకలేదు. మరో గది తలుపులు వెనక నుంచి గడియపెట్టి ఉండటాన్ని ఆయన గమనించాడు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా..బాలమణి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది.
అప్పటికే మృతి చెందిందని నిర్ధారించుకొని గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది సంవత్సరాలుగా బాలమణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరవుతూ ఉందని, ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment