
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, ప్రకాశం(అద్దంకి): భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని గమనించిన భర్త.. ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో సోమవారం జరుగ్గా మంగళవారం వెలుగు చూసింది.
ఎస్సై శివరామిరెడ్డి తెలిపిన వివరాల మేరకు పర్చూరు మండలంలోని తన్నీరువారిపాలెం గ్రామానికి చెందిన చలంచర్ల ప్రసాదు, శ్రీలక్ష్మి (35) భార్యా భర్తలు. వీరిరువురూ సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామంలోని పూర్వీకులకు సంబంధించిన ఎకరం భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో భార్యను.. భర్త వదిలేసి వేరే మహిళతో సంబంధం పెట్టుకుని ఎటో వెళ్లి పోయాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చిన భర్త, భార్య మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉందని గ్రహించి, మనిద్దరం ఇక ఒకటిగా కలసి ఉందామని చెప్పి పొలం వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ పురుగుల మందును భార్య చేత తాగించి జారుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను చికిత్స కోసం తొలుత నరసరావుపేట వైద్యశాలకు, తరువాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆమె అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చదవండి: (కడుపులో 108 డ్రగ్స్ క్యాప్యూల్స్.. అడ్డంగా బుక్కయ్యాడు..)
Comments
Please login to add a commentAdd a comment