
యశవంతపుర: గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రావాలని ఒత్తిడి చేయడానికి కాల్పులు జరిపాడో ఘరానా భర్త. బెళగావి జిళ్లా అథణి తాలూకాలో ఈ సంఘటన జరిగింది. విజయపుర జిల్లా సింధగికి చెందిన శివానంద కాలేబాగ సోమవారం సాయంత్రం భార్య ప్రీతి పుట్టినిల్లు అయిన అథణికి వెళ్లాడు. ప్రీతితో అతనికి నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా మూడేళ్ల చిన్నారి ఉంది. భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సంసారంలో విభేదాలు ఏర్పడడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
సోమవారం సాయంత్రం శివానంద అత్తవారింటికి వెళ్లి ప్రీతితో గొడవపడ్డాడు. తన వెంట రావాలని కోరగా ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేక శివానంద తనవద్దనున్న రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. నిన్ను చంపి నేను చచ్చిపోతానని వీరంగం సృష్టించాడు. దీంతో ప్రీతి, ఆమె తల్లిదండ్రులు అథణి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతన్ని అరెస్ట్ చేసి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని, విజయపుర జిల్లా వరకు మాత్రమే అనుమతి ఉందని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment