స్వాధీనం చేసుకున్న సొత్తు, బస్వరాజ్ ప్రకాష్
సాక్షి, హైదరాబాద్: ఓసారి బ్రిజా, మరోసారి డిజైర్, ఇంకోసారి క్రెటా... ఇలా ఖరీదైన కార్లలో హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్తూ.. అనువైన ఇళ్లను టార్గెట్‌గా చేసి వరుస చోరీలు చేస్తాడు... ఇలా రెచ్చిపోతున్న ఘరానా దొంగ బస్వరాజ్ ప్రకాష్ అలియాస్ విజయ్‌కుమార్ అలియాస్ జంగ్లీని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌లో పట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు ఇతడి నుంచి 1.3 కేజీల బంగారం సహా రూ.80 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు.
బెంగళూరులోని రామనగరకు చెందిన ప్రకాష్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని మేడ్చల్‌లో నివసిస్తున్నాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచి్చన ఇతగాడు 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. రామనగరలో బేకరీ ఏర్పాటు చేయగా..తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో దాన్ని వదిలేసి ఏడాది కుమార్తెతో భార్యాభర్తలు 2014లో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రకాష్‌కు ఉద్యోగం దొరకలేదు. ఓ దశలో తమ కుమార్తెకు పాలు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో తొలిసారిగా ఆ రైల్వేస్టేషన్ సమీపంలోని ఇంట్లో రూ.900 చోరీ చేశాడు.
అప్పటి నుంచి కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో వరుస చోరీలు చేస్తూ ఇప్పటి వరకు 11 సార్లు అరెస్టయ్యాడు. ఇలా అరెస్టు అవుతూ ఏడాదిలో ఆరు నెలలు జైల్లోనే ఉంటున్న ఇతడిని భార్య వదిలేసి కుమార్తెతో వెళ్లిపోయింది. అప్పటి నుంచి మేడ్చల్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. చిరు వ్యాపారిగా యజమానికి పరిచయం చేసుకున్నాడు. ఖరీదైన.. ప్రధానంగా ఎస్‌యూవీ కార్లంటే ప్రకాష్‌కు మక్కువ ఎక్కువ. దీంతో సెకండ్ హ్యాండ్ కారు ఖరీదు చేసి..దానిపైనే చోరీ చేసే చోటుకు వెళ్తాడు. తాళం వేసి ఉన్న.. ప్రధాన ద్వారం వేసి ఉండని ఇళ్లను గుర్తించి చోరీ చేస్తాడు. ఎక్కడా షెల్టర్ తీసుకోకుండా అక్కడ నుంచి తన వాహనంపై తిరిగి బయలుదేరుతాడు. నేరుగా మేడ్చల్‌లోని ఇంటికి రాకుండా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తాడు.
కొన్ని రోజులు అక్కడ తలదాచుకుని, చోరీ సొత్తును విక్రయించడంతో పాటు మరో నేరం చేసి తిరిగి వస్తాడు. ఇలా నాలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 100కు పైగా కేసులు ఇతడిపై నమోదై ఉన్నాయి. ఇలా గతేడాది కాలంలో బెంగళూరులోనే 11 నేరాలు చేశాడు. తొలినేరం చేసినప్పుడు సీసీబీ ఇన్‌స్పెక్టర్ హజారీష్ ఖలీందర్ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం ఏర్పాటైంది. వీళ్ల గాలింపు కొనసాగుతుండగానే మరో పది చోరీలు చేసేశాడు. ఆఖరుగా గత నెల్లో పంజా విసిరాడు. వేట ముమ్మరం చేసిన హజారీష్ నేతృత్వంలోని బృందం మంగళవారం మేడ్చల్‌లో ప్రకాష్‌ను పట్టుకుని తీసుకువెళ్లింది.
బెయిల్‌పై వచ్చి పరారయ్యాడు
ఇతడిపై హైదరాబాద్‌లోనూ కేసులు ఉండటంతో గతేడాది అరెస్టయ్యాడు. మేము వెళ్లేలోపే బెయిల్‌పై వచ్చి పరారయ్యాడు. చోరీ చేయడానికి వెళ్లేప్పుడు తన వెంట సెల్‌ఫోన్ తీసుకెళ్లడు. కారునూ దూరంగా పార్క్ చేసి వస్తాడు. మేడ్చల్‌లో శాశ్వత షెల్టర్ ఉన్నప్పటికీ.. ప్రతి ఆరు నెలలకోసారి కొన్ని రోజులు మరోచోట తలదాచుకుంటాడు. వాహనాన్నీ మార్చేస్తూ పోలీసు నిఘా నుంచి తప్పించుకుంటాడు. ఈ కారణంగానే అతడి కోసం ఏడాది గాలించాల్సి వచి్చంది
– ‘సాక్షి’తో సీసీబీ ఇన్‌స్పెక్టర్ హజారీష్ ఖలీందర్
Comments
Please login to add a commentAdd a comment