సాక్షి, గచ్చిబౌలి( హైదరాబాద్): అది ఆటోమేటిక్ షట్టర్. ఏం జరుగుతుందో చూద్దామనే ఆసక్తితో ఓ బాలుడు బటన్ వేసి వంగి చూశాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అదే షట్టర్‌లో ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ రాజ్‌గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుత్తుల అర్జున్ రావు, దేవి దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఏడాది క్రితం నగరానికి వలస వచ్చారు.
మొదటి అంతస్తులో షట్టర్ పైభాగంలో..
అంజయ్యనగర్‌లోని కేఎన్‌ఆర్ స్క్వేర్‌లో అర్జున్‌రావు వాచ్‌మన్‌గా పనికి కుదిరి అక్కడే పెంట్‌హౌస్‌లో కుటుంబంతో ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు రాజేష్ (11) అయిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం అర్జున్ రావు సర్వెంట్‌గా చేసే భార్య దేవిని వైట్‌ఫీల్డ్‌లో వదిలి వచ్చారు. ఉదయం 7.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా రాజేష్ కనిపించ లేదు. పెద్ద కుమారుడు భాను ప్రకాశ్‌ను అడగగా ఆడుకునేందుకు కిందికి వెళ్లాడని చెప్పాడు. ఇప్పుడే కింది నుంచి వచ్చానని.. ఎక్కడా కనిపించలేదని అర్జున్‌రావు వెతకసాగారు. మొదటి అంతస్తులో షట్టర్ పైభాగంలో రాజేష్ శరీరం చుట్టుకొని ఉండటం గమనించాడు.
కాళ్లు మాత్రమే బయటకు కనిపించడంతో కేకలు వేయగా ఇరుగు పొరుగువారు వచ్చి షట్టర్ నుంచి బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు గుర్తించారు. మొదటి అంతస్తులో ఉన్న బటన్ నొక్కి ఏమవుంతుదోనని వంగి చూడటంతో షట్టర్‌లోకి చుట్టుకుపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని బటన్‌ను బయట పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని అర్జున్ రావు బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment