ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: డీకే నగర్‌లో విద్యార్థిని దేవి.. పంజగుట్ట వద్ద చిన్నారి రమ్య కుటుంబం.. తాజాగా వారం రోజుల క్రితం బంజారాహిల్స్, నార్సింగిల్లో నలుగురు.. ఇవి సంచలనం సృష్టించి.. రికార్డులకెక్కిన ‘డ్రంకన్ డ్రైవింగ్’ ఉదంతాలు. వీటికి తోడు ఆదివారం తెల్లవారుజామున దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదమూ ఈ జాబితాలో చేరింది. (చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు)
ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏటా ఎందరు జైలుకు వెళ్తున్నా, నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా మందుబాబుల్లో మార్పు రావట్లేదు. మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడంతో పాటు ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.
తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టినా...
► సాధారణంగా రోడ్డు ప్రమాద ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎదుటి వారికి ప్రాణనష్టం కలిగించడం ఆరోపణలపై దర్యాప్తు చేసి అభియోగాలు మోపుతారు. (చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా..)
► డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదంతో ఎదుటి వారి మరణానికి కారణమైన వారిపై ఐపీసీలోని సెక్షన్ 304 (పార్ట్–2) కింద కేసు నమోదు చేయడం ప్రారంభించారు. అంటే ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో ప్రాణం పోయిందే కానీ ప్రాణం పోతుందని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అర్థం. ఆపై వెంట ఉన్న వారి పైనా ప్రేరేపించడం సెక్షన్ కింద ఆరోపణలు జోడిస్తున్నారు.
► ఇలాంటి కేసుల్లో బెయిల్ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ సైతం లభించదు. అయినప్పటికీ మందుబాబుల్లో మాత్రం మార్పు రావట్లేదు.
డేటాబేస్‌ను సెంట్రలైజ్డ్ చేయాలి...
► మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు కారణమైన, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో సమగ్ర ఎల్రక్టానిక్ డేటాబేస్ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
► ఈ తరహా ఉల్లంఘనుల్లో అత్యధికం యువత, విద్యాధికులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగి ప్రమాదాలు చేసిన వారితో పాటు వాహనాలు నడుపుతూ చిక్కిన వారి వివరాలను ఆధార్‌తో సహా పొందుపరచాలి. ఈ వివరాలను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్) ద్వారా వివిధ రకాలైన సేవలు అందించే విభాగాలకు అందుబాటులో ఉంచాలి.
► ఆయా విభాగాలు ఇందులోని వివరాలు సరిచూసుకుని తదుపరి చర్యలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ప్రధానంగా పాస్‌పోర్ట్, వీసా, జాబ్ వెరిఫికేషన్ సమయాల్లో ఇలాంటి కేసులు అడ్డంకిగా మారాలి. అప్పుడే మందుబాబులు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment