సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): బయటకు వెళ్లిన ఓ యువతీ కనిపించకుండా పోయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడ జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన షకీలా బేగం, మహ్మద్ సాబేర్ దంపతులు. వీరి కూతురు సనా బేగం(20) 5వ తేదీన సాయంత్రం బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కూతురు కనిపించడం లేదని షకీలా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా ఉండే సమీర్ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854763లో సమాచారం అందించాలన్నారు. ( చదవండి: పోలీస్‌స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని.. )
మరో ఘటనలో..
పోలీసులమని డబ్బులు లాక్కున్న ఇద్దరి అరెస్టు
డబీర్‌పురా: పోలీసులమని చెప్పి డబ్బులు, సెల్‌ఫోన్ లాక్కున్న ఇద్దరు నిందితులను మీర్‌చౌక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. దారుషిఫా ప్రాంతానికి చెందిన మహ్మద్ సోహెబ్ ఖాన్ ఈ నెల 5వ తేదీన రాత్రి మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు కాలికమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డాడు. అదే సమయంలో స్థానికంగా ఉన్న మహ్మద్ సల్మాన్(28), రఫివుద్దీన్ సయ్యద్ ఆలియాస్ మాలిక్(36)లు సోహెబ్ ఖాన్ వద్దకు చేరుకొని వాహనాన్ని మేము విడిపిస్తామని, తాము పోలీసులమని చెప్పి అతడి వద్ద నుంచి ఆన్‌లైన్‌లో రూ.3 వేలు వసూలు చేశారు. అనంతరం సోహెబ్ ఖాన్ వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకొని ఇద్దరు పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మహ్మద్ సల్మాన్, మాలిక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment