బంజారాహిల్స్(హైదరాబాద్)/బోధన్: జూబ్లీహిల్స్ రోడ్డుప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గురువారంరాత్రి జరిగిన ఈ ఘటనలో రెండు నెలల శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వేగంగా వస్తున్న మహేంద్ర థార్ కారు రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది.
కాజల్ చౌహాన్ చేతు ల్లో ఉన్న రెండున్నర నెలల బాబు అశుతోష్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెం దాడు. ఈ మహిళలు రోడ్డు పక్కన బెలూన్లు విక్రయిస్తుంటారు. కారు నడిపిస్తున్న యువ కుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. అతడితోపాటు కారు లో ఉన్న మరో యువ కుడు తప్పించుకొని పారిపోయారు. కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉంది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్యే కొడుకే నడిపించారంటూ ప్రచారం
ప్రమాదసమయంలో మద్యం సేవించి ఉంటే కేసు తీవ్రత పెరుగుతుందనే ఉద్దేశంతోనే కారు నడిపిన యువకులు పోలీసులకు లొంగిపోకుండా పారిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ భాగస్వామిగా ఉన్న అర్బన్ ఇన్‌ఫ్రా అండ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ పేరిట ఉండటంతో అనుమానాలు పెరిగాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే దుబాయిలో ఉన్న ఎమ్మెల్యే షకీల్ రంగంలోకి దిగి కారు తమదేనని, కారును డ్రైవర్ నడిపించినట్లు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారని సమాచారం.
అయితే శుక్రవారం మధ్యాహ్నం దాటినా డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో, కారు నడిపిన వ్యక్తి ఎమ్మెల్యే షకీల్ కొడుకే కావచ్చంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో షకీల్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ ప్రమాదం తో తనకు, తన కొడుకుకు సంబంధం లేదని, ఆ కారు తన కజిన్‌దని, అప్పుడప్పు డు తాను ఉపయోగించుకుంటున్నందున దానిపై స్టిక్కర్ ఉందన్నారు.
ప్రమాద సమయంలో కజిన్ మిర్జా కొడుకు కారు నడుపుతున్నాడని పేర్కొన్నాడు. బెలూన్లు అమ్ముకునే ఆ మహిళకు కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే శిశువును పడేయడంతో చిన్నారి మృతి చెందిందని ఎమ్మెల్యే తెలిపారు. శిశువు దుర్మరణం బాధాకరమని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తన బంధువును కోరినట్లు పేర్కొన్నారు.
నిమ్స్ నుంచి బాధితుల మాయం
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్‌తోపాటు మిగిలిన ఇద్దరు మహిళలు శుక్రవారం ఉదయంకల్లా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే షకీల్ సూచనల మేరకు కారు నడిపించిన వ్యక్తికి సంబంధించిన బంధువులు నిమ్స్‌కు వెళ్లి కాజల్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బాబును కోల్పోవడంతోపాటు గాయాలపాలైన తమకు రూ.2 లక్షల ఆర్థికసాయం చేయాలని, మహారాష్ట్రలోని సొంతూరికి వెళ్లిపోతామని ఆమె చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆమె కోరిన విధంగా డబ్బులు ఇవ్వడంతో ఆస్పత్రి వర్గాలకు చెప్పకుండానే వారంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment