మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం | Illegally built road by former Minister Malla Reddy removed | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం

Published Sun, Mar 3 2024 4:37 AM | Last Updated on Sun, Mar 3 2024 4:37 AM

Illegally built road by former Minister Malla Reddy removed - Sakshi

అక్రమంగా వేసిన రోడ్డును తొలగించి స్వాధీనం చేసుకుంటున్న మున్సిపల్‌ అధికారులు

గుండ్లపోచంపల్లి హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో రోడ్డు ధ్వంసం

10 గుంటల స్థలంపై గతంలో రేవంత్‌రెడ్డి ఫిర్యాదు

తాజాగా కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో కలెక్టర్‌ చర్యలు

కంటోన్మెంట్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు బోర్డు నోటీసులు

మేడ్చల్‌ రూరల్‌/కంటోన్మెంట్‌: హైదరాబాద్‌ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్‌ హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్‌ 388 పార్ట్, 523, 524 పార్ట్‌లు) మున్సిపల్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్‌ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్‌ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్‌ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్‌ కమిషనర్‌ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాములు తెలిపారు.

మల్లారెడ్డి గార్డెన్స్‌కు నోటీసులు
మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్‌ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్‌ యాక్ట్‌ –2006, సెక్షన్‌ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్‌ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్‌ గ్రాంట్‌ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్‌ ఆఫ్‌ ఆక్యుపెన్సీ రైట్‌ (హెచ్‌ఓఆర్‌) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్‌గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి.

అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్‌ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్‌ఆర్‌ సర్వే నంబర్‌ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్‌ హైస్కూల్, సీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కొనసాగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement