Gundlapochampally
-
మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం
మేడ్చల్ రూరల్/కంటోన్మెంట్: హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్ హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్ 388 పార్ట్, 523, 524 పార్ట్లు) మున్సిపల్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్స్‌కు నోటీసులు మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్ యాక్ట్ –2006, సెక్షన్ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్ గ్రాంట్ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్‌గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్ఆర్ సర్వే నంబర్ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్ హైస్కూల్, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతున్నాయి. -
భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండుకు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకా రం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది. మూడు రోజుల కిందట రాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి -
ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నా: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: చైనా లోన్‌యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్‌కు చెందిన చంద్రమోహన్ కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. చంద్రమోహన్ భార్య సరితకు ఉద్యోగం కల్పించడంతోపాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చేవరకూ చదివిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆదివారం కవిత భేటీ అయ్యారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ చైనా లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ఈ ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడటంతో భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న కవిత ఆదివారం బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించే వరకు సాయం అందిస్తానని సరితకు హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
గోడను ఢీకొన్న బైక్: ముగ్గురు మృతి
మేడ్చల్: మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామ శివారులోని స్మశానవాటిక వద్ద బైక్ అదుపు తప్పి ప్రహరీ గోడను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పేట్‌బషీరాబాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు ఎన్.అనిల్ (25), చింటు(23) స్థానికంగా ఉన్న ఐక్లీన్ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడో వ్యక్తి శశి రెడ్డి (22) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరు గుండ్లపోచంపల్లిలో అద్దెకు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు నిజామాబాద్‌కు చెందిన వారు కాగా మరొకరిని భువనగిరికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద స్టోర్
హైదరాబాద్: ఈ కామర్స్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలంగాణలో భారీ స్టోర్‌ను ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి గ్రామంలో ఫ్లిప్ కార్ట్ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ బ్రాంచ్ ను ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ స్టోర్ ల సంఖ్య 17కు చేరాయి. మొత్తం 2.2లక్షల చదరపు అడుగుల వెడల్పులో 5.89లక్షల క్యూబిక్ అడుగుల సామర్థ్యంతో భారీ స్థాయిలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్లిప్ కార్డ్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ మాట్లాడుతూ తెలంగాణ ఈ కామర్స్ ను విస్తరింపజేయడానికి అనువైన ప్రాంతమని, అందుకే తాము కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించామని చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 17 వేలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇక ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థ తన బ్రాంచీని స్థాపించడం సంతోషంగా ఉందని, ఈ సంస్థను చూసి మరిన్ని సంస్థలు తెలంగాణలో వ్యాపార సంస్థలు స్ధాపించేందుకు అనుకూలంగా ఉందని వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
వదంతులతో రైలు నుంచి దూకేశారు
గుండ్లపోచంపల్లి: కాచిగూడ-నిజామాబాద్ ఫాస్ట్‌ప్యాసింజర్ రైలు నుంచి ప్రయాణికులు కిందకు దూకడంతో 200 మంది గాయపడ్డారు. మంటలు అంటుకున్నాయని వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లి వద్ద వెంటనే చైన్‌లాగి రైలును ప్రయాణికులు ఆపేశారు. అక్కడితో ఆగకుండా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనపై సుమారు 200 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.