సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతీ యువకుల హత్యలకు హద్దూ అదుపులేకుండా పోతోంది. తాజాగా హరియాణాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని, యువతి సోదరులు అతి దారుణంగా హత్య చేశారు. పానిపట్ బిజీ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పరువు పేరుతో ప్రేమికుల వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ముఖ‍్యంగా హరియాణాలో గత మూడురోజుల్లో ఇది రెండవ హత్య.
నీరజ్(23) అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఒక నెలన్నరలోపే కుల దురహంకారానికి బలైపోయాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నీరజ్, తమ సోదరిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో నీరజ్ భార్య సోదరులు కక్ష పెంచుకున్నారు. మాట్లాడాలని పిలిచి మరీ దాడికి తెగబడ్డారు. నీరజ్‌ను కనీసం డజను సార్లు పొడిచి చంపి అక్కడినుంచి పరారయ్యారు.చాలాకాలంగా నిందితులు తన తమ్ముడిని బెదిరిస్తున్నారని, పోలీసుల రక్షణ కోరినా పట్టించుకోలేదని నీరజ్ సోదరుడు జగదీష్ వాపోయారు. దాడికి కొన్ని నిమిషాలు ముందు నీరజ్ భార్యకు ఫోన్ చేసి మరీ త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారనీ, పథకం ప్రకారమే తన సోదరుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీంటి పర్యంత మయ్యాడు. అయితే వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించి, ఇందుకు గ్రామ పంచాయతీ సమావేశంలో లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపాయి, కానీ ఆ మహిళ సోదరులు అంగీకరించలేదనీ, నీరజ్ దంపతులపై బెదరింపులకు పాల్పడ్డారని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వాట్స్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment