
పులివెందుల: తాను ప్రలోభపెట్టానంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి చెప్పిందంతా అవాస్తవమని జర్నలిస్ట్ భరత్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. దస్తగిరి 2021, సెప్టెంబర్ 30వ తేదీన సీబీఐ అధికారులకు ఇచ్చిన లేఖలో చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. ఆ లేఖలో తాను ఓ న్యాయవాదితో కలసి డబ్బు, పొలం ఇస్తామని ప్రలోభాలకు గురి చేసినట్లు దస్తగిరి పేర్కొన్నాడని, ఇది నిజంకాదన్నారు. గతంలో తాను కేసు విషయమై మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత సీబీఐ అధికారులు తనను కడప వారి గెస్ట్‌హౌస్‌కు పిలిచి మీడియా సమావేశాలు పెడితే కేసులో ఇరికిస్తామని, ఏ విషయం ఉన్నా తమ వద్దకు వచ్చి చెప్పాలని బెదిరించారన్నారు. దీంతో తాను మౌనంగా ఉన్నానని తెలిపారు.
ఇప్పుడు కూడా తాను మౌనంగా ఉంటే దస్తగిరి చెప్పినవి నిజమని నమ్మే అవకాశముందని, తనపై లేనిపోని ఆరోపణలతో కేసులు పెడతారనే ఆందోళనతో మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. దస్తగిరి ఇచ్చిన లేఖలో తమ పేర్లు రాయడం చాలా బాధాకరమన్నారు. దస్తగిరి 164 స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత తాము ప్రలోభాలకు గురి చేశామన్నాడని, అసలు స్టేట్‌మెంట్ రికార్డు చేసేసిన తర్వాత ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం ఏముంటుందని భరత్ యాదవ్ ప్రశ్నించారు. కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్ మారదు కదా అని అన్నారు. నిజానికి తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి మాత్రమే దస్తగిరిని అడిగానని, ఆయన రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడన్నారు.
డబ్బు విషయం మాట్లాడిన ప్రతిసారీ ‘‘నాకు సీబీఐ అండగా, తోడుగా ఉంది, నాకేం కావాలన్నా సీబీఐ చేస్తుందని.. అందుకే వారి మాట వింటాను’’ అని దస్తగిరి అంటుండేవాడన్నారు. తోడు రమ్మంటేనే దస్తగిరితో ఢిల్లీకి వెళ్లానని, ఆ ఖర్చులు కూడా తానే ఇచ్చానని.. ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా సీబీఐకి గతంలోనే ఇచ్చానని భరత్ యాదవ్ తెలిపారు. దస్తగిరి చెప్పే అబద్ధాలను సీబీఐ గమనించాలని ఆయన కోరారు. దస్తగిరి అందరికి చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడన్నారు.