సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వ్యవహరిస్తున్న తీరు సందేహాస్పదంగా మారుతోంది. వారిని అడ్డుపెట్టుకుని సాగుతున్న సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు బలపడుతున్నాయి. వివేకా హత్యకు పరస్పర భిన్నమైన కారణాలు చెబుతూ సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఆ దంపతులు వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాలు ఆశించే..
వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్య చేసిన దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చడాన్ని సునీత వ్యతిరేకించనే లేదు. పైగా అతడితో తరచూ మాట్లాడుతుండటం గమనార్హం. తండ్రిని హత్య చేసిన నిందితుడితో సత్సంబంధాలు నెరుపుతూ ఇతరులపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటన్నది అంతు చిక్కకుండా ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే సునీత, ఎన్.రాజశేఖరరెడ్డి దంపతులు ఆ విధంగా వ్యవహరిస్తున్నాని స్పష్టమవుతోంది.
ఉద్దేశపూర్వకంగానే..
బెంగళూరులో భూ వివాదం నేపథ్యంలోనే వైఎస్ వివేకాను ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి హత్య చేశారని సీబీఐ పేర్కొంది. ఆ మేరకు దస్తగిరి వాంగ్మూలాన్ని ఆధారంగా ప్రస్తావించింది. భూ వివాదం నేపథ్యంలోనే తన తండ్రిని హత్య చేశారనే సునీత చెప్పుకొచ్చారు. కానీ తర్వాత కడప ఎంపీ టికెట్‌కు అడ్డు తొలగించుకోవడం కోసమే వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఈ హత్య చేయించారనే ప్రచారాన్ని సీబీఐ ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెచ్చింది. అందుకు సునీత, భర్త ఎన్.రాజశేఖరరెడ్డి, అతడి సోదరుడు ఎన్.శివప్రకాశ్‌రెడ్డి సీబీఐ ముందు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చూపించారు. హత్యకు భూ వివాదం కారణమని చెప్పినవారే... అంతలోనే పూర్తి విరుద్ధంగా కడప ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని ఆరోపించడం సందేహాస్పదంగా మారింది.
చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్న ఎన్‌ఐఏ
తాజాగా కడప ఎంపీ టికెట్ కోసమంటూ తాము చేసిన ఆరోపణల్లో పస లేదని నిర్ధారణ కావడంతో కొత్త పల్లవి అందుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం డ్రామా అని, ఆ తరహాలోనే ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే వివేకాను హత్య చేయించారని నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. నాడు వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు విశాఖ విమానాశ్రయంలో దాడికి పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. మరి అలాంటప్పుడు ఆ హత్యాయత్నం అంతా డ్రామా అని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి ఆరోపించడం ఏమిటో అర్థం కావడం లేదు. తన తండ్రి వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో తేల్చాలన్న అంశంపై సునీతకు చిత్తశుద్ధి లేదన్నది తద్వారా స్పష్టమవుతోంది. కేవలం తమ రాజకీయ, ఇతరత్రా ప్రయోజనాల కోసమే ఈ కేసును ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడవుతోంది.
వీరి తీరు ఆది నుంచి సందేహాస్పదమే..
► వివేకా మృతి చెందారని ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి మొదట సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డికే సమాచారమిచ్చారు. కానీ కాసేపటికే రాజశేఖరరెడ్డి సోదరుడు అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఎలా చెప్పారు?
► వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆయన అనుచరుడు ఇనయతుల్లా ఫొటోలు, వీడియోలు తీసి వారి కుటుంబ సభ్యులకు ఉదయం 6.30 గంటలకే వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన తరువాత అయినా ఆయన్ని హత్య చేశారని సునీత, ఆమె భర్త ఎందుకు గుర్తించ లేదు? ఆ తరువాత కూడా వారు పీఏ ఎంవీ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి సందేహాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేయమని ఎందుకు చెప్పారు?
► వైఎస్ వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, ఆయన సెల్‌ఫోన్‌ను పీఏ ఎంవీ కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డికి చెప్పారు. మరి వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాలని వారు ఎందుకు చెప్పలేదు? తాము వచ్చే వరకు వాటిని దాచి ఉంచాలని సూచించారు. వారు మధ్యాహ్నానికి పులివెందుల చేరుకున్నాక... సాయంత్రం ఆ లేఖ, సెల్‌ఫోన్‌లను పోలీసులకు అప్పగించారు. అలా ఎందుకు చేశారు? పోలీసులకు అప్పగించే ముందు ఆ సెల్‌ఫోన్‌లోని ఏ డేటాను డిలీట్ చేశారు? ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు?
► బాత్రూమ్‌లోని వివేకా మృతదేహాన్ని హాల్లోకి తీసుకురావాలని ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి చెప్పారని ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. శివప్రకాశ్‌రెడ్డి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
► షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం వాస్తవం కాదా? తన రెండో భార్యకు రూ.10 కోట్లు ఇవ్వాలన్న వివేకా నిర్ణయాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు ఎన్.రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారు. కుటుంబ బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివేకానందరెడ్డికి చెక్ పవర్ లేకుండా చేశారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించారు. ఈ విషయాలను షమీమ్ స్వయంగా సీబీఐకి వెల్లడించారు. ఈ అంశాలపై సునీత ఎందుకు స్పందించడం లేదు?
► వివేకాకు తాము రాజకీయ వారసులు కావాలని ఆయన పెద్ద బావమరిది ఎన్.శివప్రకాశ్‌రెడ్డి, చిన బావమరిది, అల్లుడైన ఎన్.రాజశేఖరరెడ్డి భావించారు. అందుకు వివేకా సానుకూలంగా లేకపోవడంతో ఆయనపై ఆగ్రహం పెంచుకోవడం వాస్తవం కాదా?
వివేకా హత్యపై వింత వాదనలు
Published Wed, Mar 2 2022 3:55 AM | Last Updated on Wed, Mar 2 2022 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment