
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతినివ్వడంతో పాటు అతనికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ కడప చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఈ నెల 26న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కడప కోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న తుమ్మల గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ రాయ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు టి.నిరంజన్‌రెడ్డి, బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ, అతను అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమన్నారు. ఇప్పటికే దస్తగిరి వాంగ్మూలాన్ని సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద నమోదు చేశారని, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారని తెలిపారు.
సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేసిన తరువాత అప్రూవర్‌గా మరోసారి వాంగ్మూలం నమోదు చేయడానికి వీల్లేదన్నారు. నిందితుడైన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఓ సాక్షిగా అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పులివెందుల కోర్టు రంగం సిద్ధం చేస్తోందన్నారు. కడప కోర్టు ఉత్తర్వుల వల్ల పిటిషనర్లకు తీరని నష్టం కలుగుతుందన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై కౌంటర్‌కు సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా ఉన్న దస్తగిరికి నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment