పబ్ వద్ద వివరాలు సేకరిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు
అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు.. అడ్డదారుల్లో జీహెచ్‌ఎంసీ ఇచ్చిన ట్రేడ్ లైసెన్స్‌లు... క్షేత్ర స్థాయిలో తనిఖీలు లేకుండానే ఎక్సైజ్ జారీ చేసిన బార్ లైసెన్స్‌లు... ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం లేకుండానే అక్రమ దారుల్లో అనుమతులు... ఇలా ఉంటుంది జూబ్లీహిల్స్‌లోని పలు కాలనీల్లో వెలసిన పబ్‌లు, కేఫేలు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఆందోళనలు చేసినా నిమ్మకునీరెత్తిన చందాన అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల పక్కనే నడుస్తున్న పబ్‌లతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. శబ్ధ కాలుష్యం ఏర్పడినప్పుడు, పరిమితికి మించి వేళల్లో నడుస్తున్నప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ పోలీసులు తనిఖీలు చేయాల్సి ఉండగా అన్నింటికీ పోలీసులనే బాధ్యులను చేస్తూ స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు!)
► జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని టాట్ పబ్ ఎదుట స్థానికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. తమ ఇళ్ల మధ్యనే ఈ పబ్ నిర్వహణ రోజూ న్యూసెన్స్‌గా మారిందని ఆందోళన చేశారు.
► అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా పబ్‌లో మ్యూజిక్ సిస్టమ్ నడుస్తున్నదని యువతీయువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వీరి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని ఆరోపించారు. (చదవండి: జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు)
► పబ్‌లో తాగిన మద్యం సీసాలను మత్తులో తమ ఇళ్లల్లోకి విసురుతున్నారని దుయ్యబట్టారు.
► ఈ పబ్ వల్ల స్థానికులకు కంటి మీద కునుకు ఉండటం లేదని గగ్గోలు పెట్టారు. ఎక్సైజ్ పోలీసులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారని భగ్గుమన్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు జోగుతున్నారని ఆరోపించారు.
హైకోర్టులో పిటిషన్...
► జూబ్లీహిల్స్ కాలనీలో నివాసాల మధ్యనే పబ్‌లతో పాటు కాఫీ షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు సమస్యాత్మకంగా మారాయని ఇళ్ల ముందే ఉమ్ముతున్నారని కొంత మంది వాంతులు చేసుకుంటున్నారని తమకు ఈ పబ్‌లతో నరకప్రాయంగా మారిందంటూ జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ (క్లీన్ అండ్ గ్రీన్) అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, అడవుల ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు నగర పోలీసులను ప్రతివాదులుగా చేర్చి అసోసియేషన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
యథేచ్ఛగా అక్రమ పార్కింగ్‌లు...
► పబ్‌లు ఉన్న ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36, రోడ్ నం. 45, రోడ్ నం. 1, రోడ్ నం. 10 ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లన్నీ రాత్రి 8 మొదలు తెల్లవారుజామున 2 గంటల వరకు రోడ్డుకు రెండువైపులా పబ్‌లకు, క్లబ్‌లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే వారి వాహనాల అక్రమ పార్కింగ్‌లతో నిండిపోతున్నాయి.
పట్టించుకోని జీహెచ్‌ఎంసీ...
► పార్కింగ్ లేకుండానే భవనాలు అక్రమ అంతస్తుల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు అద్దె తీసుకుంటూ ఇంటి యజమమానులు పార్కింగ్ లేకుండానే అద్దెలకు ఇచ్చేశారు.
► జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదు. ట్రేడ్ లైసెన్స్ అడ్డదారుల్లో మంజూరవుతున్నది. వీరి పాత్రపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. జూబ్లీహిల్స్ కాలనీవాసులు కూడా జీహెచ్‌ఎంసీని పల్లెత్తు మాట అనడం లేదు.
మొద్దు నిద్రలో ఎక్సైజ్...
► జూబ్లీహిల్స్ కాలనీలో ఇబ్బడిముబ్బడిగా ఇష్టారాజ్యంగా పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు కావడంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసుల నిర్వాకం చెప్పనలవి కాదు. నెలనెలా మామూళ్లు దండుకుంటున్న ఈ పోలీసులు ఇక్కడ ఏం జరుగుతున్నదో పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
► న్యూ ఇయర్ వచ్చిందంటే పాస్‌లు, మామూళ్లకు అలవాటు పడుతున్న ఎక్సైజ్ పోలీసులు ఇక్కడ అర్ధరాత్రి దాటినా లిక్కర్ కొనసాగుతుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రాత్రి పరిమితికి మించి నడిస్తే ఎక్సైజ్‌పోలీసులు ఆ పబ్‌ను సీజ్ చేయాల్సి ఉంటుంది.
► అక్రమంగారోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే జీహెచ్‌ఎంసీ ఆ భవనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ తప్పులన్నీ ఎక్సైజ్, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా స్థానికులు మాత్రం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులను లక్ష్యంగా చేసుకొని బద్నాం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
► జీహెచ్‌ఎంసీ, ఎక్సైజ్ పోలీసులు సమన్వయం.. చిత్తశుద్ధితో వ్యవహరించి అడ్డదారులు.. ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న పబ్‌లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment