అప్పుడే పెళ్లి.. అంతలోనే పరస్పరం దాడులు
ఏకాంత గదిలో ప్రాణాలు కోల్పోయిన జంట
కర్ణాటకలోని కేజీఎఫ్‌లో విషాదం
కేజీఎఫ్/కోలారు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లయిన రోజే ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు వేట కొడవళ్లతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ(19), చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరు నివాసి మునియప్ప కుమారుడు నవీన్‌కుమార్(27)లు ప్రేమించుకున్నారు.
పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్ పూర్తి చేయగా, నవీన్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం కర్ణాటక చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్ సోదరి ఇంట్లో వారిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవ దంపతులు గొడవ పడ్డారు, గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.
ఇద్దరూ ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానాలున్నాయి. వధువు లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, అనంతరం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని వీడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment