ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నాగోలు: చదువులో వెనకపడుతున్నానని మనస్తాపానికిలోనైన బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. క్రిష్ణా జిల్లా, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన దాసరి డేవిడ్ రాజు నగరానికి వలసవచ్చి ఎల్‌బీనగర్ సెంట్రల్ బ్యాంకు కాలనీలో ఉంటూ సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు దాసరి చందు (21) మంగళపల్లిలోని ఏవీఎన్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి బీటెక్ రెండో సంత్సరం సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈ విషయమై తరచూ బాధపడేవాడు.
ఆదివారం కుటుంబసభ్యులు బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చందు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం చర్చి నుంచి తిరిగి వచ్చిన అతడి తల్లి కిటికీలో నుంచి చూడగా చందు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బలవంతంగా తలుపులు తెరిచి చందును కిందకి దించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అతడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి డేవిడ్ రాజు ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment