హ్యాకర్ల ఆటలు..! | At Least 39% In India Had Stolen Their Personal Info By Hackers | Sakshi
Sakshi News home page

హ్యాకర్ల ఆటలు..!

Published Sat, Nov 21 2020 8:51 AM | Last Updated on Sat, Nov 21 2020 8:53 AM

At Least 39%  In India Had Stolen Their Personal Info By Hackers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ పుణ్యమా అని ఇప్పుడు డిజిటల్‌ ప్రపంచానికి, వాస్తవానికి మధ్య అంతరం దాదాపుగా చెరిగిపోయింది. ఐటీ ఉద్యోగాలు ఇళ్లకు చేరిపోవడం, పాఠశాలలు నట్టింట్లోకి వచ్చేయడం, కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తరచూ కొనేస్తుండటంతో మనకొచ్చిన సౌలభ్యమేమిటో తెలియదు గానీ.. సైబర్‌ నేరగాళ్ల పంట పండుతోంది.. ఈ కోవిడ్‌ కాలంలోనూ హ్యాకర్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ భద్రతపై ఇకనైనా కాసింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఐటీ భద్రత సంస్థ నార్టన్‌ జరిపిన ఒక సర్వే ప్రకారం ఇటీవలి కాలంలో సైబర్‌ నేరాల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. డిజిటల్‌ వెల్‌నెస్‌ రిపోర్ట్‌ పేరుతో సిద్ధం చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.. కోవిడ్‌ మహమ్మారి కాలంలో హ్యాకర్లు కంపెనీల నెట్‌వర్క్‌లలోకి చొరబడటం, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఎక్కువైంది.

నార్టన్‌ లైఫ్‌లాక్‌ సైబర్‌ సేఫ్టీ ఇన్‌సైట్స్‌ 2019 నివేదిక ప్రకారం.. భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 39 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు తస్కరణ బారినపడ్డారు. మాల్‌వేర్‌ల సాయంతో కంప్యూటర్లపై పట్టు సాధించి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించడం సాధారణమైపోతోంది. ఈ సమాచారాన్ని బ్రోకర్లకు అమ్ముకుని హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు..సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించేందుకు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ క్లుప్తంగా వీపీఎన్‌ చాలా ముఖ్యమని డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ 2020 సర్వే ద్వారా స్పష్టమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న సిబ్బంది కంపెనీతో సురక్షిత పద్ధతిలో కనెక్టయ్యేందుకు వీపీఎన్‌ ఉపయోగపడుతుంది. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేయడం వల్ల హ్యాకర్ల పప్పులు ఉడకవు. 

 వైర్‌లెస్‌ ఫిడిలిటీ లేదా వైఫై కనెక్షన్‌కూ భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవడం ద్వారా సైబర్‌ నేరగాళ్ల బారిన పడటం తక్కువవుతుందని, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫై విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఈ సర్వే తెలిపింది. డిజిటల్‌ వెల్‌నెస్‌ రిపోర్ట్‌ కోసం సర్వే చేసిన వారిలో 24 శాతం మంది పబ్లిక్‌ వైఫై ఉపయోగిస్తున్నట్లు తెలపడం ఇక్కడ గమనించదగ్గ విషయం..లాక్‌డౌన్‌ సమయంలో కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) పేరుతో వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని దొంగిలించడం ఎక్కువైందని తేలింది. డార్క్‌వెబ్‌లో నిక్షిప్తమయ్యే ఈ సమాచారాన్ని తొలగించడం అంత సులువు కాదు. అందువల్లనే ఆన్‌లైన్‌లో ఎవరితోనైనా సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement