- హ్యాకింగ్ ఎన్నో విధాలు.. మరెన్నో కోణాలు
- ఇది పూర్తి తప్పూ కాదు.. హ్యాకర్లంతా మోసగాళ్లూ కాదు
కంప్యూటర్ కీబోర్డుపై ఓ వ్యక్తి వేళ్లు వేగంగా కదులుతున్నాయి.. చల్లటి ఏసీ గదిలోనూ నుదుటిపై చెమట బిందువులు కనిపిస్తున్నాయి.. తెరపై అక్షరాలు, అంకెలు గజిబిజిగా ప్రత్యక్షమవుతున్నాయి.. అంతలోనే మాయమవుతున్నాయి. ఇంకోవైపు అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి.. కంపెనీల వెబ్‌సైట్లపై సమాచారం గజిబిజిగా మారిపోతోంది.. ఐసిస్, అల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థల బినామీ బ్యాంకు అకౌంట్లలోకి కోట్లకు కోట్ల సొమ్ము వచ్చి పడుతోంది.. ఇంకోవైపు దేశాల రక్షణ స్థావరాల్లోని మిస్సైళ్లు వాటంతట అవే పేలడానికి కౌంట్‌డౌన్ మొదలైపోతోంది. అంతటా అల్లకల్లోలం.. ఇంతలో ఓ హీరో ప్రత్యక్షమయ్యాడు. ఆఖరి సెకనులో ‘ఆ వ్యక్తి’ ఆటలు కట్టించాడు...
హ్యాకింగ్, హ్యాకర్ వంటి పదాలకు హాలీవుడ్ సినిమాలు ఇచ్చే వర్ణన దాదాపు ఇలాగే ఉంటుంది. కొన్ని లక్షల కంప్యూటర్లను, ఇంటర్నెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలను తన అదుపులో ఉంచుకున్నాడన్న ఆరోపణపై రష్యన్ ఒకరిని అరెస్ట్ చేయడంతో హ్యాకింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిజంగానే హ్యాకర్లు అంతటి శక్తిమంతులా? ప్రపంచాన్ని తల్లకిందులు చేసేయగలరా? అసలు ఈ హ్యాకింగ్ అంటే ఏమిటి? ఎందుకు, ఎలా చేస్తారు?... ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న దృష్ట్యా హ్యాకింగ్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ అంశంపై ఈ వారం ‘ఫోకస్’..
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
హ్యాక్.. హ్యాక్.. హ్యాక్..
అవి ఆరో దశకం చివరి రోజులు.. మనుషుల కంటే వేగంగా లెక్కలు వేయగల కంప్యూటర్లు అప్పుడప్పుడే కనిపిస్తున్నాయి. కంప్యూటర్‌లో ఉన్న సర్క్యూట్లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొంతమంది ఇంజనీర్లు వాటిని మరింత వేగంగా, సమర్థంగా పనిచేసేలా మార్చేవారు. అలా సర్క్యూట్లను తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడాన్ని హ్యాక్ అనేవాళ్లు. కాలం మారుతున్న కొద్దీ దాని స్థానంలో హ్యాకర్లు అన్న పేరు వాడకంలోకి వచ్చింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్లతోపాటు నెట్‌వర్కింగ్‌లోనూ మంచి ప్రతిభ కలిగిన ఇంజనీర్లను హ్యాకర్లు అనేవారు. ఆ సమయంలో వచ్చిన అనేక హాలీవుడ్ సినిమాలు హ్యాకర్లను పూర్తిగా నెగటివ్ కోణంలో చూపించాయి. హ్యాకర్లు చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారని, డబ్బు కోసం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హైజాక్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తారని.. ఇలా రకరకాల ఇతివృత్తాలతో వచ్చిన సినిమాలు వారిపై సాధారణ ప్రజలకు ఉండే అభిప్రాయాన్ని మార్చేశాయి. మరి హ్యాకింగ్ గురించి వింటున్నది అంతా తప్పేనా? అంటే కాదనే చెప్పాలి. నెట్‌వర్కింగ్ రంగంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం హ్యాకింగ్‌కు పాల్పడేవారు చాలామంది ఉన్నారు. కేవలం డబ్బు కోసం ఇతరుల కంప్యూటర్లలోకి చొరబడి బ్లాక్‌మెయిల్ చేసేవాళ్లు.. సమాచారాన్ని తస్కరించి, ఇతరులకు అమ్ముకునేవాళ్లు.. ఇలా ఎన్నో రకాల హ్యాకర్లు ఉన్నారు.
6,00,000 రోజూ హ్యాక్ అయ్యే ఫేస్‌బుక్ అకౌంట్ల సంఖ్య ఇది
బ్లాక్ హ్యాట్.. వైట్ హ్యాట్.. రెడ్ హ్యాట్!
హ్యాకింగ్ గురించి మాట్లాడుతూ ఈ టోపీల గోల ఎందుకని అనుకోవద్దు. ఇవన్నీ హ్యాకర్లలో రకరకాల వాళ్లకున్న పేర్లు. వీరంతా దాదాపు ప్రొఫెషనల్స్.. వీరికితోడు హ్యాకర్ల ప్రపంచంలో సాధారణ స్థాయి వారైన స్క్రిప్ట్ కిడ్డీస్ కూడా ఉంటారు. వీరు సరదా కోసం అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ కోడ్ సాయంతో వైరస్ లాంటివి తయారు చేసి వదులుతుంటారు. కంప్యూటర్ల ఐపీలకు వేలకొద్దీ రిక్వెస్ట్‌లు పంపి అవి క్రాష్ అయ్యేలా చేస్తారు. ఇక ప్రధాన హ్యాకర్లలో వైట్‌హ్యాట్ లేదా ఎథికల్ హ్యాకర్ల గురించి చూస్తే... హ్యాకర్ల ప్రపంచంలో సైడ్ హీరోల్లాంటి వారు వీరు. కంప్యూటర్లలోంచి వైరస్‌లు తొలగించడం.. హ్యాకర్లు నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు ఉన్న అవకాశాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటికి విరుగుడు సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడం వీళ్లు చేసే పని.
సాధారణంగా వైట్ హ్యాట్ హ్యాకర్లంతా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పెద్ద చదువులు చదివిన వారే. ఈ వైట్‌హ్యాకర్లకు పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేసే వాళ్లు బ్లాక్‌హ్యాట్ హ్యాకర్లు. వీరిని క్రాకర్స్ అని కూడా అంటారు. బ్యాంకులు, కంపెనీల నెట్‌వర్క్‌ల్లోకి చొరబడి డబ్బు, సమాచారం దొంగిలించడం వంటివి చేస్తారు. ఇక డబ్బు కోసం కాకుండా, నెగెటివ్ ఆలోచనలతో వెబ్‌సైట్లను ధ్వంసం చేసే వాళ్లను గ్రేహ్యాట్స్‌గా, స్క్రిప్ట్ కిడ్డీలుగా చెబుతారు. తమకు కోపం తెప్పించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటే బ్లూహ్యాట్‌గా పేర్కొంటారు. చివరగా రెడ్‌హ్యాట్స్.. వీరు హీరోల్లాంటి వారు. విలన్లు విధ్వంసం సృష్టిస్తుంటే, మంచి వారిని కాపాడటంతోపాటు.. అవసరమైతే వైరస్‌లతో హ్యాకర్లపై ప్రతిదాడులు చేస్తారు. హ్యాకర్ల కంప్యూటర్లను పనికిరాకుండా చేసేందుకు అన్ని రకాల టెక్నాలజీలనూ వాడుతారు.
వేలిముద్రలూ సురక్షితం కాదు..
డిసెంబర్, 2014:జర్మనీలో హ్యాకర్ల వార్షిక సమావేశం ‘కియాస్ కమ్యూనికేషన్స్’సదస్సు జరుగుతోంది. పాస్‌వర్డ్స్ కంటే వేలిముద్రలు ఎంతో సురక్షితమైనవన్న అంచనాలు ఈ సందర్భంగా పటాపంచలయ్యాయి. జాన్‌క్రిస్లర్ అలియాస్ స్టార్‌బగ్ అనే హ్యాకర్ కేవలం కొన్ని ఫొటోల ఆధారంగా అందులోని వ్యక్తి తాలూకు వేలిముద్రలను సునాయాసంగా సేకరించి చూపారు. ఆ ఫొటోల్లోని వ్యక్తి ఎవరో తెలుసా.. జర్మనీ రక్షణ మంత్రి ఉర్సులా వాండెర్ లయన్. ఈమధ్య కాలంలో మన స్మార్ట్‌ఫోన్లలోనూ హైరిజల్యూషన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటికి మార్కెట్‌లో దొరికే వెరిఫింగర్ అనే సాఫ్ట్‌వేర్ సాయంతో క్రిస్లర్ ఈ పనిచేయగలిగాడు. ఎథికల్ హ్యాకర్ కాబట్టి సరిపోయిందిగానీ.. అదే పని ఓ తీవ్రవాద భావాలున్న బ్లాక్‌హ్యాట్ చేసుంటే..?
ప్రపంచవ్యాప్తంగా మైడూమ్ వైరస్ కారణంగా జరిగిన నష్టం 3,850 కోట్ల డాలర్లు
హ్యాకింగ్ కారణంగా ఏటా కంపెనీలు కోల్పోతున్న మొత్తం 40,000 కోట్ల డాలర్లు
మన దేశంలో ప్రభావం ఎంత?
మన దేశంలో కంప్యూటర్ల వాడకం తక్కువ.. క్రెడిట్‌కార్డులూ తక్కువే కాబట్టి హ్యాకింగ్ బెడద మనకు పెద్దగా ఉండదు అనుకునేవారికి గత ఏడాది అక్టోబరులో ఓ షాక్ తగిలింది. ఎవరు చేశారో స్పష్టంగా తెలియలేదుగానీ.. హిటాచీ పేమెంట్ సర్వీసెస్ తాలూకూ కంప్యూటర్ నెట్‌వర్క్ నుంచి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 32 లక్షల క్రెడిట్ కార్డు వినియోగదారుల వివరాలు తస్కరణకు గురయ్యాయి. వీరిలో ఐసీఐసీఐ, యస్, యాక్సి స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. హ్యాకింగ్ జరిగిన కొన్ని వా రాలకు గానీ ఆ విషయం బయటపడకపోవడం గమనార్హం. ఆ తరువాత బ్యాంకు అధికారులు ఖాతాదారులను హెచ్చరించడంతోపాటు చాలా క్రెడిట్ కార్డులను బ్లాక్ చేశారు. కొన్నింటికి కొత్త కార్డు లు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన సెక్యూరిటీ సంస్థ ఎస్‌ఐఎస్‌ఏ ఈ కేసును విచారిస్తోంది.
పెద్దల వెబ్‌సైట్ల గురించి మీరు వినే ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సమాజం హర్షించే పనేమీ కాదుకదా.. అందుకే ఇలాంటి సైట్లలో సభ్యత్వం తీసుకునే వారు తమ వివరాలు అత్యంత గోప్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ.. హ్యాకర్ల పుణ్యమా అని గత ఏడాది ఈ గుట్టు రట్టయిపోయింది. అంతర్జాతీయంగా పేరొందిన ఓ పెద్దల వెబ్‌సైట్ ఖాతాదారులు దాదాపు 41 కోట్ల మంది వివరాలను హ్యాకర్లు సేకరించగలిగారు. చాలా సాధారణమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ఈ హ్యాకింగ్ సక్సెస్ అయ్యేందుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఈమెయిల్ ఐడీలు, వయసు, ప్రాంతం బ్యాంకు అకౌంట్ల వివరాలు సైతం బయటకు పొక్కిపోవడం.. ఖాతాదారుల్లో చాలామంది హాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు ఉన్నారన్న వదంతులు వ్యాపించడంతో ఈ హ్యాకింగ్ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
జాగ్రత్తలు ఇవీ..
► సంబంధం లేని ఈ–మెయిళ్లకు అస్సలు స్పందించవద్దు.
► వీలైనంత వరకూ పాస్‌వర్డ్స్ తరచూ మారుస్తూ ఉండాలి. వేర్వేరు అకౌంట్ల కు వాడిన పాస్‌వర్డ్స్‌ను గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది అనుకుంటే పాస్‌వర్డ్ మేనేజర్ అప్లికేషన్ వాడవచ్చు.
► ఫలానా లాటరీ తగిలిందని.. ఫలానా వ్యక్తి కోట్లు వదిలిపెట్టి చనిపోయాడని వచ్చే ఈమెయిళ్లు, సందేశాలు ఫక్తు మోసం. అత్యాశకు పోయి బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు ఎవరికీ వెల్లడించవద్దు
► కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌లలో తప్పనిసరిగా మంచి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
► ఉచితంగా లభిస్తోంది కదా అని పబ్లిక్ వైఫైలను వాడక పోవడం శ్రేయస్కరం.
ఎత్తుకు.. పైఎత్తులు..
హ్యాకర్లు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. స్థూలంగా చూస్తే ఈ టెక్నిక్‌లు దాదాపు పది వరకు ఉన్నాయి.
► మీరు మీ బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవుతున్నప్పుడు ‘వర్చువల్ కీబోర్డ్’అన్న పదం చూసే ఉంటారు. అది కీలాగింగ్ అనే హ్యాకింగ్ టెక్నిక్ బారిన పడకుండా ఉండేందుకు పనికొస్తుంది. కీలాగర్ సాఫ్ట్‌వేర్ మన కంప్యూటర్‌లోకి జొరబడితే కీబోర్డుపై మనం టైప్ చేసే అక్షరాలు అదే క్రమంలో ఒక లాగ్‌ఫైల్‌లో నిక్షిప్తమవుతూ ఉంటాయి. వాటిలో మన మెయిల్‌ఐడీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు కూడా ఉంటాయి. హ్యాకర్లు వాటి సాయంతో మన అకౌంట్లలోకి జొరబడి డబ్బు కాజేసే అవకాశం ఉంటుంది.
► ఇక మీకు పడని ఏ వ్యక్తి తాలూకు వెబ్‌సైట్‌నైనా పనిచేయకుండా చేయాలంటే హ్యాకర్లు వాడే టెక్నిక్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్! సాఫ్ట్‌వేర్ సాయంతో వందల వేల డమ్మీ కంప్యూటర్లు సృష్టించి.. వాటి ద్వారా సర్వర్, సైట్‌కు పెద్ద ఎత్తున రిక్వెస్ట్‌లు పంపడం ద్వారా అది పనిచేయకుండా చేసేయడం ఈ టెక్నిక్.
► తీవ్రవాదులు నిర్వహించే రెక్కీ గురించి మీకు తెలుసుగా.. హ్యాకర్ ప్రపంచంలోనూ ఇలాంటి టెక్నిక్ ఒకటి ఉంది. వాటర్‌హోల్ టెక్నిక్ అని దానికి పేరు. హ్యాక్ చేయాలనుకున్న కంప్యూటర్ ఓనర్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుని, బహిరంగ ప్రదేశాల్లో కృత్రిమ వైఫైను సృష్టిస్తారు. దాని ద్వారా ఆ కంప్యూటర్‌లోకి జొరబడటం వాటర్ హోల్ టెక్నిక్ పనిచేసే విధానం. తెలిసో తెలియకో అలాంటి కృత్రిమ వైఫైలకు కనెక్ట్ అయితే.. హ్యాకర్లు మీ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్లలోని సమాచారాన్ని తస్కరించవచ్చు.
► ఇక మీ సమాచారం జోలికి వెళ్లకుండా.. మీ కంప్యూటర్‌తో ఏం చేస్తున్నారు, ఎలాంటి వెబ్‌సైట్‌లు చూస్తున్నారు? వంటి వివరాలు సేకరించేందుకు ఈవ్స్ డ్రాపింగ్ అనే టెక్నిక్‌ను వాడతారు.
► ఫిషింగ్ టెక్నిక్.. మీరు తరచూ చూసే వెబ్‌సైట్ హోం పేజీ నకలును సిద్ధం చేసి.. దాని ద్వారా వివరాలు సేకరించడం దీని ఉద్దేశం. ఒకసారి మనం వివరాలు అందిస్తే చాలు.. తర్వాత హ్యాకర్లు ట్రోజన్ హార్స్ వంటి దురుద్దేశపూర్వక సాఫ్ట్‌వేర్‌లను మన కంప్యూటర్‌లోకి జొప్పించి విధ్వంసం సృష్టిస్తారన్నమాట. ట్రోజాన్ హార్స్, వైరస్‌లు ఉన్న పీసీల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు హ్యాకర్‌ను చేరుతూంటుంది.
► డెస్క్‌టాప్‌పై ఉన్న క్రోమ్ బ్రౌజర్‌ను నొక్కితే.. ఏదో మీకు సంబంధం లేని వెబ్‌సైట్ ఓపెన్ అయిందనుకోండి. మీరు క్లిక్‌జాకింగ్ హ్యాకింగ్ బారిన పడినట్లు లెక్క. హ్యాకర్లు తమకు అవసరమైన వెబ్‌సైట్లకు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు దీన్ని వాడుతూంటారు.
► ఇక బ్రౌజర్ కుకీస్‌ను తస్కరించి మీ సమాచారాన్ని సేకరించడం, ఓ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టి దాని ద్వారా మీ కంప్యూటర్‌ను నియంత్రించడం వంటివెన్నో హ్యాకింగ్ టెక్నిక్స్‌లో ఉన్నాయి.
5,000 కోట్లు చోరీ..!
మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన హ్యాకింగ్ ఉదంతం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. అంతర్జాతీయ లావాదేవీల కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఉపయోగించే స్విఫ్ట్ నెట్‌వర్క్‌ను కొంతమంది హ్యాక్ చేశారు. విడతల వారీగా 95 కోట్ల డాలర్లు (రూ.5,000 కోట్లు) ట్రాన్స్‌ఫర్ చేయాలని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు పేరుతో ఆదేశాలు పంపించారు. ఆ సొమ్ములో కొంత మొత్తం శ్రీలంక, ఫిలిప్పీన్స్ దేశాల్లోని అకౌంట్లలోకి తరలిపోగా.. మిగతా మొత్తం ట్రాన్స్‌ఫర్ కాకుండా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చివరి క్షణంలో అడ్డుకుంది. శ్రీలంక, ఫిలిప్పీన్స్ అకౌంట్లకు మళ్లిన నిధుల్లో దర్యాప్తు సంస్థలు దాదాపు 90 శాతం మేరకు రికవరీ చేయగలిగాయి. ఈ ఉదంతంలో బంగ్లాదేశ్ రిజర్వుబ్యాంకు సిబ్బంది చేతివాటం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
మీ బ్యాంకు ఖాతా వివరాలు పది పైసలే!
‘‘రండి బాబు రండి.. ఒక్కో బ్యాంకు ఖాతాదారుడి వివరాలు పది పైసలు మాత్రమే. కొనుక్కోండి.. జనాల డబ్బులు దండుకోండి..’’ కొద్ది రోజుల క్రితం వరకూ ఢిల్లీ వాసి పూరన్‌గుప్తా చేసిన వ్యాపారం ఇదే. ఆ బ్యాంకు ఖాతాలు/క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలతో ఏం లాభం అనుకోవద్దు. వాటితోనే కొన్ని ఫేక్ కాల్ సెంటర్లు బతికేస్తున్నాయి! ఇదీ ఒక రకంగా హ్యాకింగే. మోసగాళ్లు ఖాతాదారులకు ఫోన్ చేసి.. ఫలానా బ్యాంకు/కార్డు సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ.. ఖాతాలు, కార్డుల వివరాలు చెబుతారు. వాటిని సరిచూసుకోవడానికి, లేదా బ్లాక్ చేయకుండా ఉండడానికి ఫోన్ చేశామని నమ్మబలుకుతారు. ‘‘మీకిప్పుడో పాస్‌వర్డ్ వస్తుంది. అదేంటో చెప్పండి’’ అంటూ.. ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము తస్కరిస్తున్నారు.. పూరన్‌గుప్తా వద్ద కోటి మంది భారతీయుల బ్యాంకు, క్రెడిట్, డెబిట్‌కార్డు వివరాలు ఉన్నాయి. వయసు, నెలవారీ జీతాలు, క్రెడిట్ కార్డు పరిమితులు వంటి వివరాల వారీగా వర్గీకరించిన సమాచారం ఉంది.
ఒకప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన పూరన్.. తను పనిచేస్తున్న కంపెనీ నుంచి ఈ సమాచారాన్ని తస్కరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అలా తస్కరించిన సమాచారాన్ని ఫేక్ కాల్ సెంటర్ల వారికి అమ్ముతున్నాడు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి ఒక ఫేక్ కాల్ సెంటర్ రూ.1.46 లక్షలకు టోపీ పెట్టింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా పూరన్‌గుప్తా వ్యవహారం బయటపడింది. డిజిటల్ ఎకానమీ వైపు మళ్లండి.. అని కేంద్రం పదే పదే కోరుతున్న ఈ తరుణంలో ఇలాంటివి వెలుగులోకి రావడం ఆ వ్యవస్థపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.