చిత్తూరు అర్బన్: భార్యను హత్య చేసిన కేసులో నగరికి చెందిన శరవణ (26)కు జీవితఖైదు విధిస్తూ చిత్తూరు ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి శాంతి గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.నిర్మల కథనం మేరకు.. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో ఉంటున్న పులివర్తి నాని ఇంట్లో నగరి ప్రాంతంలోని నెత్తంకు చెందిన శరవణ సెక్యూరిటీ, వాచ్‌మెన్ డ్యూటీ చేసేవాడు.
2017లో లక్ష్మీనగర్ కాలనీకు చెందిన సత్యను శరవణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బిడ్డ పుట్టి, అనారోగ్యంతో కొన్నాళ్లకే చనిపోయింది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న శరవణ నిత్యం ఆమెను హింసించేవాడు. 2019 జనవరిలో తన అక్క ఊరికి వెళదామని సత్యను తీసుకుని శరవణ పిచ్చాటూరు మండలం వెంగళత్తూరుకు వెళ్లాడు.
జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అక్క ఇంట్లోని బాత్‌రూమ్‌లో సత్యను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. దీనిపై మృతురాలి తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిచ్చాటూరు పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను, కేసు దర్యాప్తు అధికారులను విచారించిన అనంతరం శరవణకు జీవితఖైదు, రూ.1500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...!
Comments
Please login to add a commentAdd a comment