తాడిమర్రి(అనంతపురం జిల్లా): దాడితోట గ్రామ సమీపాన చిత్రావతి నదిలో శుక్రవారం సాయంత్రం ప్రేమజంట గల్లంతయ్యింది. ఎస్‌ఐ డి.లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం మండలం చదళ్ల గ్రామానికి చెందిన ఎర్రి నాగప్ప, నాగేశమ్మ దంపతుల మూడో కుమారుడు అమర్‌నాథ్ (22) అనంతపురం, తాడిపత్రిలో సెంట్రింగ్ పనులు చేస్తుండేవాడు. అతనితో పాటు సెంట్రింగ్ పనులు చేస్తున్న దాడితోటకు చెందిన పశురాంతో పరిచయమైంది. ఈ క్రమంలో అనంతపురం నగరంలోని ప్రకాష్ రోడ్డుకు చెందిన ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న రామాంజినమ్మ (20)తో అమర్‌నాథ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.
చదవండి: కన్నతల్లి ఉన్మాదం.. దేవుడు ఆవహిస్తున్నాడని.. వేటకొడవలితో
ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం ఉదయం దాడితోటలోని పరుశురామ్ ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులుగా సీబీఆర్‌లో ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నదిలో నీటిని చూడటానికి ముగ్గురూ కలసి చిత్రావతిలోకి వెళ్లారు. అక్కడ నీటిని చూస్తూ సెల్ఫీలు.. తీసుకుని తిరిగి ఇంటికి వస్తున్న తరుణంలో నీరు తాగడానికని రామాంజినమ్మ నదిలోకి వెళ్లింది. నీరు తాగుతున్నపుడు కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అమర్‌నాథ్ రక్షించేందుకు దూకాడు. ఇద్దరు భయాందోళనకు గురై ఒకరిని ఒకరు పట్టుకుని నీటి ఉధృతిలో కనిపించకుండాపోయారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ డి.లక్ష్మీనారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లారు. ముందుగా సీబీఆర్ నుంచి వస్తున్న నీటిని బంద్ చేయించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment