
పుష్ప (ఫైల్)
అత్త మందలించడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
తాడిమర్రి(అనంతపురం జిల్లా): అత్త మందలించడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన దాసరి వెంకటేష్ పెద్ద కుమారుడు వెంకటనరసింహులు ప్రైవేట్ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ నౌకరుగా పని చేస్తున్న మాల్యవంతం నివాసి ఏకుల రామాంజినేయులు కుమార్తె పుష్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 14 నెలల కవలలు (బాబు, పాప) ఉన్నారు. (చదవండి: వైరల్: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు)
ఇంటిలో పని సక్రమంగా చేయడం లేదంటూ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో అత్త సావిత్రమ్మ మందలించడంతో మనస్తాపం చెందిన పుష్ప.. గ్రామ శివారులోని వేప చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఏకపాదంపల్లికి చేరుకుని అత్తింటి వారిపై దాడికి ప్రయత్నించారు. స్థానికులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. విషయం తెలుసుకున్న ధర్మవరం రూరల్ సీఐ మన్సూరుద్దీన్, తహసీల్దార్ హరిప్రసాద్, ఏఎస్‌ఐ వన్నప్ప ఆ గ్రామానికి చేరుకుని ఇరు కుటుంబాలతో మాట్లాడారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు కేసు నమోదుకు విముఖత వ్యక్తం చేయడంతో పోస్టుమార్టం నిమిత్తం పుష్ప మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చదవండి:
వందేళ్ల క్రితం కనుమరుగైన గ్రామం.. రికార్డుల్లో మాత్రం సజీవం