శ్రీకాంత్, గీత, శివ, అమృత(ఫైల్ ఫోటోలు)
పెళ్లికి పెద్దలు అంగీకరించారు.. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు.. ఏం జరిగిందో ఏమో గానీ ప్రేమికులిద్దరూ ‘చేయరాని తప్పుచేశాం, సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం’అంటూ చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించారు. ఇదీ సంగారెడ్డి జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య ఘటన తీరు. మరోచోట తొలుత పెద్దలు ప్రేమను అంగీకరించలేదు.. కులం ఒకటే అయినా ఆస్తుల అంతరం అడ్డువచ్చింది.. తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయి. అయితే విషయం ప్రేమికులకు తెలియక బలవన్మరణం చెందారు. ఇదీ కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది.
– మునిపల్లి(అందోల్)/వాంకిడి(ఆసిఫాబాద్)
తెలియక..
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వాంకిడిలోని రాంపూర్ కాలనీకి చెందిన నాగడే శ్రీకాంత్(22), అదే కాలనీకి చెందిన ఎల్ములె గీత(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 3 నెలల క్రితం ప్రేమ విషయాన్ని గీత ఇంట్లో తెలిపింది. కులాలు ఒకటైనా, శ్రీకాంత్ కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో గీత ఇంట్లో అడ్డుచెప్పారు. దీంతో ప్రేమికులు ఇద్దరు డిసెంబర్ 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వాంకిడి మండలం అక్నీ గ్రామ శివారులో శ్రీకాంత్ తండ్రి పాండు పత్తి పంట కౌలుకు సాగుచేస్తున్నారు. చేనులో మోదుగ చెట్టుకు శ్రీకాంత్ ఉరేసుకుని ఉండటం, గీత మృతదేహం చెట్టు పక్కనే ఉండటం సమీప రైతులు గమనించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాల నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలాఉండగా, ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయిన రెండో రోజే పెళ్లి చేసేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో నిర్ణయించారు. కానీ ప్రేమికులిద్దరి సెల్‌ఫోన్‌లు స్విచాఫ్ రావడంతో సమాచారం చేరలేదు. ఇదేక్రమంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు.
తప్పు చేశామని..
కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కోహీర్ గ్రామానికి చెందిన బుగ్గుల అమృత(20) సం గారెడ్డి అంబేడ్కర్ స్టడీ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా శిక్షణ తీసుకుంటోంది. మర్పల్లి మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన శివ(22) సంగారెడ్డిలోని సిద్ధార్థ పారామెడికల్ కాలేజీ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఇళ్లలో తెలుపగా.. పెద్దలు అంగీకరించారు. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా అమృత కోహీర్‌లోని ఇంటికి వచ్చింది. డిసెంబర్ 31న సంగారెడ్డికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది.
ఏం జరిగిందోగానీ.. జనవరి 2న రాత్రి 7.30 గంటల సమయంలో శివ తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి మునిపల్లి మండలం బుదేరా గ్రామ శివారులో సూసైడ్ చేసు కుంటున్నామని తెలిపాడు. కుటుంబ సభ్యులు రాత్రి బుదేరా శివారులో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఇద్దరూ వేలాడుతూ కనిపించారు. అమృత తండ్రి అశోక్‌బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘చేయరాని తప్పు చేశాం, ఆ తప్పును సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని శివ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment