మమత హత్య కేసు: వీడని మిస్టరీ! | Mamtha Deceased Case Mystery In Nizamabad | Sakshi
Sakshi News home page

మమత హత్య కేసు: వీడని మిస్టరీ!

Published Mon, Nov 16 2020 1:16 PM | Last Updated on Mon, Nov 16 2020 1:59 PM

Mamtha Deceased Case Mystery In Nizamabad - Sakshi

న్యావనంది గ్రామస్తులతో మాట్లాడుతున్న సీపీ(ఫైల్‌)

సాక్షి, నిజామాబాద్‌‌: సిరికొండ మండలం న్యావనందిలో జరిగిన మమత హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఎన్నో హత్య కేసులు ఛేదించిన పోలీసులకు ఈ కేసు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తోంది. హత్య జరిగి 45 రోజులు గడుస్తున్నా పోలీసులకు కనీసం ఆధారాలు కూడా లభించకపోవడంతో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార పార్టీకి చెందిన వారి హస్తం ఉందంటూ ప్రతిపక్ష పార్టీ ఆరోపిసోతంది. అనవసర ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. ఇటీవల బీజేపీ నేతలు గ్రామస్తులతో కలిసి సీపీ కార్యాలయం వద్ద ఆందోళన సైతం నిర్వహించారు. ఈ హత్య కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 3న హత్య న్యావనంది గ్రామంలో అక్టోబర్‌ 3న మమత తన పొలంలో పని చేసుకునేందుకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకసాగారు. ఈ క్రమంలో మమత తన పొలంలోనే శవమై కనిపించింది.

గ్రామస్తులకు సమాచారం తెలియడంతో హుటహుటిన పొలంలోకి తరలివెళ్లారు. మమత హత్యకు గురైందని పోలీసులకు సమచారం అందించారు. దీంతో సిరికొండ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. అయితే కేసులో ఎంతకీ పురోగతి కనిపించకపోవడంతో పార్టీల మధ్య ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఆధారాలు దొరకక అవస్థలు మమత హత్యకేసును ఛేదించే క్రమంలో పోలీసులకు సరైన ఆధారాలు లభించడంలేదు. దీంతో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నారు. అయినా సరైన ఆధారాలు లభించకపోవడంతో మరింత లోతుగా విచారిస్తున్నారు. హత్య చేయబడిన స్థలానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ ఆధారాలను గుర్తించలేకపోయిన ట్లు పోలీసులు చెబుతున్నారు. మరో వైపు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్న వారిని సైతం విచారిస్తున్నారు. అయినా కూడా సరైన ఆధారాలు లభించడంలేదని పోలీసులు తెలుపుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు మమత హత్య కేసును ఛేదించేందుకు సీపీ కార్తికేయ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేశారు. ఇందులో సీసీఎస్‌ ఏసీపీ స్వామి, రుద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ శాకీర్‌ అలీ, సిరికొండ ఎస్సై రాజశేఖర్‌ ఉన్నారు.

వీరు కేసును శోధిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు రోజురోజుకు నిరసనలు పెరుగుతుండడంతో పోలీసులు ఈ కేసును త్వరగానే ముగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ దుమారం మమత హత్య కేసు రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ నాయకులు, ఎంపీ అర్వింద్‌ ఇప్పటికే పలుమార్లు మమత కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయం ముందు గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. గ్రామస్తులు సిరికొండ పోలీసు స్టేషన్‌ను కూడా ముట్టడించారు. మంత్రి, ఎమ్మెల్యేలు కూడా మమత కుటుంబాన్ని పరామర్శించారు. దీంతో ఈ కేసులో రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. హత్య కేసులో అధికార పార్టీ నాయకుల హస్తం ఉందంటూ బీజేపీ నేతలు పలుమార్లు ఆరోపణలు చేశారు. అనవసర ఆరోపణలు చేస్తున్నారని అధికారి పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. రాజకీయంగా ఈ కేసు దుమారం రేపుతుండడంతో పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో పోలీసులు కేసు ఛేదనను చాలెంజ్‌గా తీసుకున్నారు.

నిందితులను త్వరగా అరెస్టు చేస్తాం
మమత హత్యకేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. పక్కా ఆధారాలతో నిందితులు ఎవరైనా సరే పట్టుకొని అరెస్టు చేస్తాం. ప్రస్తుతం విచారణ లోతుగా కొనసాగుతోంది. సరైన ఆధారాల కోసం అన్వేషణ జరుగుతోంది. హత్యకు సంబంధించి వివరాలు, అనుమానిత వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ పకడ్బందీగా విచారణ చేస్తున్నాం. ఈ కేసుల్లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నిందితులు ఎంతటివారైనా సరే ఆధారాలతో సహా అరెస్టుచేసి తీరుతాం. – శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement