ఆస్తి కోసమే అంతమొందించారు | Wife Killed Husband Along With Her 2 Sons In Nizamabad | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసమే అంతమొందించారు

Published Wed, Jul 3 2019 12:06 PM | Last Updated on Wed, Jul 3 2019 12:07 PM

Wife Killed Husband Along With Her 2 Sons In Nizamabad - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న బాన్సువాడ డీఎస్పీ యాదగిరి

సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్‌) : కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాల్సిన భార్య కట్టుకున్నోడినే ఆస్తి కోసం హత్య చేసింది. ఉన్నంతలో కొడుకుల బాగోగులు చూసిన తండ్రికి ఆ కనికరం లేకుండా నిద్రిస్తున్న చోటనే మెడకు ఉరేసి హత్య చేసిన సంఘటన మండలంలో మంగళవారం కలకలం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన ముక్కిడి కామయ్య(65) అనే వ్యక్తిని అతడి భార్య లాలవ్వ, ఇద్దరు కుమారులు వీరేశం, సాయిలు కలిసి సోమవారం అర్ధరాత్రి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనం వద్ద నిద్రిస్తున్న కామయ్యను మెడకు ఉరి బిగించి హత్య చేశారు. ఆ వెంటనే నిందితులు ముగ్గురు బీర్కూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. దీంతో పాటు బీర్కూర్‌ ఎస్‌ఐ పూర్ణేశ్వర్‌ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.. బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, బాన్సువాడ టౌన్‌ సీఐ మహేష్‌ అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పూర్ణేశ్వర్‌ తెలిపారు.

ఆలనాపాలనా తమ్ముడిదే... 
హత్యకు గురైన కామయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలం క్రితం కుమార్తెకు వివాహం చేశారు. అయితే ఏడాది కాలంగా ఆస్తి కోసం కుటుంబ సభ్యులు కామయ్యను వేధిస్తుండేవారని గ్రామస్తులు తెలిపారు. కామయ్య తన సోదరుడి కుటుంబంతో కలిసి  మొత్తం నాలుగు ఎకరాల 12 గుంటల భూమి ఉంది. అయితే ఇద్దరు అన్నదమ్ములు చెరిసగం పంచుకోగా కామయ్యకు 2ఎకరాల 6 గుంటల భూమి వచ్చింది. అయితే కొంత కాలంగా కుటుంబంలో కలతలు రావడంతో గ్రామంలో పలుమార్లు కులపెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించి కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చారు. అయినా మార్పు రాకపోవడంతో మృతుడు వీధుల్లోనే స్నానం చేస్తూ ఇంటికి దగ్గరలో ఉన్న మున్నూరుకాపు భవనంలో నిద్రించేవాడు. భార్య పిల్లలు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో తమ్ముడే కామయ్య ఆలనాపాలన చూసేవాడు.  

ఆస్తి పంచిన 24గంటల్లోనే.. 
సోమవారం కామయ్య తన పేరిట ఉన్న 2 ఎకరాల 6 గుంటల భూమిలో 20 గుంటల భూమిని తన తమ్ముడి పేరిట రాసి మిగిలిన 66 గుంటల భూమిని కొడుకులిద్దరికి సమానంగా పంచి ఇచ్చాడు. అయితే చిన్నాన్నకు భూమి ఎందుకు ఇచ్చావంటూ కొడుకులతో గొడవ కాగా గ్రామస్తులు సర్ది చెప్పారు. ఎప్పటి మాదిరిగానే భోజనం చేసి సంఘ భవనంలో నిద్రిస్తున్న కామయ్యను అర్ధరాత్రి సమయంలో తాడుతో మెడకు ఉరి బిగించి అరవకుండా తప్పించుకోకుండా చేతులు కాళ్లు కట్టేసి ప్రాణం పోయే వరకు తాడును బిగించినట్లు పోలీసులు వివరించారు. కామయ్య మృతి చెందిన తరువాత తాను పిల్లర్‌కు కట్టేసి అక్కడి నుండి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. కామయ్య స్వతహాగా మృదుస్వభావి అని గ్రామస్తులు వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement