పోలీసులను అడ్డుకుంటున్న గ్రామస్తులు
సాక్షి, ఇందల్‌వాయి: నల్లవెల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వార్డు మెంబర్ డీపీ గంగారాం(49)ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గంగారాం పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా దారి కాసి పథకం ప్రకారం ద్విచక్ర వాహనాన్ని అడ్డుకొని దుండగులు హత్య చేశారు. తలపై నరికి, బండరాళ్లతో కొట్టి చంపి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారు. రాత్రి తొమ్మిది గంటలైనా ఫోన్ లేపకపోవడం, ఇంటికి రాకపోయేసరికి అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. దారిలో గంగారాం మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. గంగారాం గ్రామ పంచాయతీలో 12వ వార్డు మెంబరుగా కొనసాగుతున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధారాలు సేకరించడానికి సోమవారం ఉదయం గ్రామానికి వచ్చిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్పల్లికి చెందిన గంగారం బావ మరిది లక్ష్మీనారాయణపై గ్రామస్తులు అనుమానంతో దాడి చేశారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు గొడుగు రాజు, దామ అనిల్, లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తానే చంపినట్లు సోమవారం సాయంత్రం మృతుడి అల్లుడు రాజు డిచ్‌పల్లి ఠాణాలో సీఐ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment