
జయపురం: బొరిగుమ్మ సమితిలోని బిసింగపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న భూమియగుడ గ్రామంలో ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య రేగిన చిన్న వివాదం అందులో ఓ వ్యక్తి హత్యకి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.. భూమియగుడ గ్రామానికి చెందిన డొంబురు భూమియ(27) ఆదివారం ఉదయం బాగా మద్యం తాగివచ్చి ఊరి మధ్యలో అల్లరి చేశాడు. అదే సమయంలో భరత్ నాయక్(23) అనే మరో వ్యక్తి అతడి వద్దకు వచ్చి ఎందుకు ఊరికనే అల్లరి చేస్తున్నావ్.. అని అడిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న డొంబురు ఆగ్రహంతో తన వద్ద ఉన్న ఓ పెద్దకర్రతో భరత్ తలపై గట్టిగా మోదాడు.
ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని, గాయాలతో పడిఉన్న భరత్‌ని ఇంటికి తీసుకువెళ్లి నీరు తాగించారు. ఆ తర్వాత భరత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ఈ ఘటనపై భరత్ తండ్రి బిసింగపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోస్టుమార్టం అనంతరం యువకుడి మృతదేహాన్ని బాధిత బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment