భర్త, అత్తమామలతో మృతురాలు లక్ష్మీప్రత్యూష (ఫైల్)
సాక్షి,పశ్చిమగోదావరి: మరికొద్ది నెలల్లో వారసుడి కేరింతలతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఐదో నెల గర్భిణి అయిన తమ కోడలు దారుణ హత్యకు గురైందని తెలిసిన అత్తమామలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పండంటి బిడ్డకోసం ఎదురుచూసిన భర్త గుండెలవిసేలా రోదించాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తల్లి, కుమార్తె దారుణహత్యకు గురైన వార్త గణపవరంలో కలకలం రేపింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన లక్ష్మీప్రత్యూష (31)ను గణపవరానికి చెందిన రిటైర్డ్ ఆడిటర్ మానాప్రగఢ రాంబాబు కుమారుడు సాయి తేజస్వికి ఇచ్చి ఈ ఏడాది జనవరిలో వివాహం చేశారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తేజస్వి కోవిడ్ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఇంటి వద్ద నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భార్య లక్ష్మీప్రత్యూషకు తొలి ఆషాఢమాసం కావడంతో గతనెల రెండో వారంలో సత్తెనపల్లి పుట్టింటికి వెళ్లింది. శ్రావణమాసం రావడంతో తేజస్వి వారం క్రితం సత్తెనపల్లి అత్తవారింటికి వెళ్లి సంప్రదాయ ప్రకారం కొబ్బరికాయలు కొట్టి రెండు రోజులు ఉండి వచ్చాడు. లక్ష్మీప్రత్యూషను వచ్చేనెల 1న గణపవరం తీసుకువెళతామని చెప్పాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.
శనివారం వరుసకు అన్న అయిన వ్యక్తి లక్ష్మీప్రత్యూషను ఆమె తల్లి పద్మావతిని సత్తెనపల్లిలో కత్తితో పొడిచి హతమార్చాడు. మరో మూడు రోజుల్లో కోడలు వస్తుందన్న ఆనందంలో ఉన్న భర్త, అత్తమామలకు విషయం తెలిసి కుప్పకూలిపోయారు. హుటాహుటిన సత్తెనపల్లి బయలుదేరారు. దీంతో రాంబాబు బంధువులు, సన్నిహితులతో పాటు గణపవరంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment