వరకట్నం వేధింపులు.. అల్లుడ్ని చెట్టుకు కట్టేసి.. | Man Attacked By Wifes Family In Orissa | Sakshi
Sakshi News home page

వరకట్నం వేధింపులు.. అల్లుడ్ని చెట్టుకు కట్టేసి..

Published Wed, Feb 24 2021 8:11 AM | Last Updated on Wed, Feb 24 2021 9:04 AM

Man Attacked By Wifes Family In Orissa - Sakshi

సంఘటన దృశ్యం

భువనేశ్వర్‌ : కొరాపుట్‌ జిల్లా సెమిలిగుడ సమితిలోని మాలిగొంజ గ్రామంలో  అత్తింటి వారు అల్లుడిని స్తంభానికి కట్టి చితకబాదారు. తాగిన మైకంలో అల్లుడు తమ కుమార్తెను వేధిస్తున్నాడని తెలుసుకున్న అత్తింటివారు  ఆగ్రహోదగ్రులై అల్లుడిని మంగళవారం గ్రామానికి తీసుకువచ్చి గ్రామం మధ్యలో గల విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టిన దృశ్యాలు  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసిన పొట్టంగి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి   స్పృహతప్పిన ఆ యువకుడిని రక్షించారు. మొదట అతడిని పొట్టంగి హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడినుంచి కొరాపుట్‌లోని సహిద్‌ లక్ష్మణ నాయక్‌  వైద్య కళాశాల హాస్పిటల్‌లో చేర్చారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సెమిలిగుడ సమితిలోని మాలిమొరియ గ్రామానికి చెందిన యువకుడు లొఖి ఖొర, మాలిగొంజ గ్రామానికి చెందిన ధనేశ్వర గొలారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన కొన్నాళ్లకు కట్నం తీసుకు రమ్మని భార్యను వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు. ( తెల్లారిన కూలీల బతుకులు)

అంతే కాకుండా ఆమెను సోమవారం కన్నవారింటికి తీసుకుని బయలు దేరాడు, మార్గంలో ఆమెను అమానుషంగా కొట్టి దారిలోనే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబసభ్యులు వెంటనే వచ్చి మార్గమధ్యంలో ఉన్న ధనేశ్వరిని ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. అనంతరం కోపంతో సెమిలిగుడలో ఉన్న అల్లుడు లొఖి ఖొరను ఎత్తుకు వచ్చి మాలిగొంజి గ్రామంలో విద్యుత్‌ స్తంభానికి కట్టి చితకబాదారు. ఈ సంఘటనపై ధనేశ్వరి, లొఖి ఖొర కుటుంబ సభ్యులు పోలీసులకు పరస్పరం  ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement