హైదరాబాద్ : తక్కువ ధరకే ద్విచక్ర వాహనం అమ్మకానికి ఉందని ఫేస్‌బుక్‌లో యాడ్ చూసి ఓ వ్యక్తి రూ.82వేలు మోసపోయిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు తెలిపిన వివరాలు.. చింతల్ చెరుకుపల్లి కాలనీకి చెందిన రాండువ రాజేందర్‌రెడ్డి (35) గత నెల 22న తన ఫేస్‌బుక్ ఖాతాలో హోండా యాక్టివా రూ.25వేలకే అమ్మకానికి ఉన్నట్లు యాడ్ చూశాడు. వెంటనే అక్కడ ఇచ్చిన 8099294153 నెంబర్‌కు కాల్ చేయగా సదరు వ్యక్తి నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నానని ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్నానని తనకు జమ్ము కాశ్మీర్ ట్రాన్స్‌ఫర్ అయ్యిందని చెప్పాడు. రాజేందర్‌ను నమ్మించడానికి నితిన్‌జైన్ పేరిట ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నట్లు ఓ ఐడీ కార్డు వాట్సప్ ద్వారా పంపాడు.
నమ్మిన రాజేందర్ నితిన్‌జైన్‌కు రూ.21,501లను గూగుల్ పే ద్వారా పంపించాడు. మరునాడు 23న నితిన్‌జైన్ అనే వ్యక్తి రాజేందర్‌కు ఫోన్‌చేసి రూ.61,117లు ఫోన్‌పేలో వేస్తే.. బండి డబ్బులు మినహా మిగతా మొత్తాన్ని ఇస్తానని తెలిపాడు. నమ్మిన రాజేందర్ డబ్బును పంపించాడు. అనంతరం మరో వ్యక్తి ఫోన్ చేసి యాక్టివా లారీలో వస్తుంది ఖర్చుల నిమిత్తం మరో రూ. వెయ్యి పంపమని అడిగాడు. ఇంతలో తేరుకున్న రాజేందర్ రెడ్డి మోసపోయానని గ్రహించి గురువారం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment