ప్రతీకాత్మక చిత్రం
చిత్తూరు అర్బన్: వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం బలిగొన్న సంఘటన చిత్తూరు నగరంలో గురువారం వెలుగుచూసింది. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు కథనం మేరకు, పుంగనూరుకు చెందిన ఈశ్వర్‌రెడ్డి (50) భార్యకు దూరంగా ఉంటున్నాడు. రెండేళ్లుగా చిత్తూరులో ఈయన కూరగాయలు, తినుబండారాలు విక్రయిస్తూ నివశిస్తున్నాడు. ఈయనకు యాదమరికి చెందిన లలితతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
చదవండి: కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా
ఈ క్రమంలో బుధవారం వీరిద్దరూ సుందరయ్యవీధిలోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపు తరువాత డబ్బులు విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఈశ్వర్‌రెడ్డిని నెట్టేయడంతో తలకు తీవ్రగాయమై అక్కడే మృతి చెందాడు. దీంతో గురువారం ఉదయం లలిత గది తాళాలు వేసి రిసెప్షన్‌లో ఇచ్చి వెళ్లిపోయింది. మధ్యాహ్నం లాడ్జిని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరచిచూడగా ఈశ్వర్‌రెడ్డి మృతి చెంది ఉన్నాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లాడ్జి గదిని లలిత పేరుమీద బుక్ చేయడంతో పోలీసుల పని సులభతరమైంది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోన్ నంబర్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment