
పట్నా: వారసత్వ భూమి తగాదాల కారణంగా ఒక వ్యక్తిని, గర్భవతి అయిన అతని భార్యను బంధువులు కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం వైశాలి పోలీస్ స్టేషన్‌లోని బేలార్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లోని జరాంగ్ రాంపూర్ గ్రామంలో ఈ జంట హత్య జరిగింది. మృతులు శశి ఠాకూర్, అతని భార్య సంగీత దేవి ఐదు నెలల గర్భిణి.
ఈ దంపతులకు రెండు, మూడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శశి ఠాకూర్‌కు తన బంధువులతో వారసత్వ భూమికి సంబంధించి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ విషయంపై తన బంధువులతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో శశి ఠాకూర్, అతని భార్య సంగీతా దేవిని వారి బంధువులు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఆపై పదునైన కత్తితో వారి గొంతులు కోసి హత్య చేశారు.
అనంతరం వారి మృతదేహాలను ఒక నిందితుడి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ ఘర్షణలో మృతుడికి చెందిన ముగ్గురు బంధువులకు గాయాలు కాగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్యకు గురైన గర్భిణీ సంగీతా దేవి తల్లి అహల్య దేవి 17 మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సన్నీ ఠాకూర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment