చింతకొమ్మదిన్నె (కడప): జీవితాంతం తోడు నీడగా నిలవాల్సిన భర్త వేధింపులు, అత్త మామల సతాయింపులతో ఓ మహిళ చిన్న వయస్సులోనే బలవన్మరణం చెందింది. మండలంలోని కడప–పులివెందుల ప్రధాన రహదారి సమీపంలోని బృందావనం కాలనీలో గురువారం నవిత(24)అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి కథనం మేరకు సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడురుకు చెందిన నవితకు కడపకు చెందిన వెంకట బాబారెడ్డికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నెల తర్వాత నుంచి అత్త మామలు, భర్త అదనపు కట్నం కోసం వేధించసాగారు.
ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో అదనపు కట్నం సైతం అందించారు. అయినప్పటికీ ఆమెను మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవారు. దీంతో ఆమె మనోవేదనకు గురైంది. గురువారం ఉదయం తల్లి దండ్రులకు ఫోన్ చేసి ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందింది. కడప రూరల్ సీఐ శ్రీరామ శ్రీనివాసులు, సీకె దిన్నె ఎస్‌ఐ ఎం.మంజునాధ్‌రెడ్డిలు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. తహసీల్దార్ విజయ్ కుమార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment